Gary Hall Jr Olympic Medals : అమెరికా లాస్ ఏంజెలెస్‌లో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకూ తీవ్రమవుతూ పెను నష్టాన్ని కలిగిస్తోంది. దీంతో వేలాదిమంది నిరాశ్రయులవుతున్నారు. ఈ కార్చిచ్చు వల్ల పలువురి సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల ఇళ్లు బూడిదయ్యాయి. అయితే ఈ కార్చిచ్చు వల్ల అమెరికాకు చెందిన మాజీ స్విమ్మర్ గ్యారీ హాల్ జూనియర్ 10 ఒలింపిక్ పతకాలను పొగొట్టుకున్నాడు.
'నాకు టైమ్ లేకపోయింది'
"భయంకరమైన కార్చిచ్చు వల్ల పసిఫిక్ పాలిసాడ్స్‌లోని నా అద్దె ఇల్లు, పది ఒలింపిక్ పతకాలు, ఇంటిలోని సామగ్రి నాశనమైంది. నేను, నా పెంపుడు శునకం, కొన్ని వ్యక్తిగత సామగ్రితో మంటల నుంచి బయటపడ్డాం. మీరు చూసిన ఏ అపోకలిప్స్ సినిమా కంటే ఈ కార్చిచ్చు 1,000 రెట్లు దారుణంగా ఉంది. అగ్నిప్రమాదం తర్వాత నా ఒలింపిక్ పతకాలను తిరిగి పొందడానికి సమయం లేదు." అని మాజీ స్విమ్మర్ గ్యారీ హాల్ జూనియర్ తెలిపాడు.
'అవి లేకుండా జీవించలేను'
ఒలింపిక్ పతకాలు లేకుండా తాను జీవించలేనని ఆవేదన వ్యక్తం చేశాడు గ్యారీ హాల్ జూనియర్. "నా ఇంటిని కార్చిచ్చు చుట్టిముట్టిన సమయంలో నేను పతకాల గురించి ఆలోచించాను. కానీ అంత సమయం లేకపోయింది. అందుకే ఒలింపిక్ పతకాలన్నీ కాలిపోయాయి. అవి లేకుండా నేను బతకలేను. నా ఇల్లు కాలిపోయింది. కానీ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. గందరగోళంలో కూడా నేను ప్రశాంతంగా ఉండగలగడం నా అదృష్టం. దీంతో వెంటనే ప్రాణాలు కాపాడుకోవడం కోసం నా కుక్కను, కొన్ని వస్తువులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాను." అని గ్యారీ హాల్ జూనియర్ పేర్కొన్నాడు.
అసలేం జరిగిందంటే?
లాస్ ఏంజెలెస్‌ను కార్చిచ్చు కమ్మేసింది. ఈ మంటల్లో గ్యారీ హాల్ జూనియర్ ఇల్లు కూడా కాలిపోయింది. అదృష్టవశాత్తు మంటలను గమనించిన అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అయితే అతడు సాధించిన 10 ఒలింపిక్ మెడల్స్ ఆ మంటల్లో కాలిపోయాయి. హాల్ 2000 (సిడ్నీ), 2004 (ఏథెన్స్) ఒలింపిక్స్ లో వరుసగా బంగారు పతకాలు గెలుచుకున్నాడు. 1996 (అట్లాంటా) ఒలింపిక్స్ లో మూడు స్వర్ణాలను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఒలింపిక్ క్రీడల్లో మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలను సాధించాడు.
లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు బీభత్సం- హాలీవుడ్ స్టార్ల ఇళ్లు దగ్ధం