Five Young Boys Die in Kondapochammasagar Dam : పండుగ వేళ సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మర్కుర్ మండలం కొండపోచమ్మసాగర్ డ్యాంలో పడి ఐదుగురు యువకులు మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు డ్యాంలో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వీరిలో ఐదుగురు నీటిలో మునిగి చనిపోయారు. ఇద్దరు యువకులు ప్రాణాలతో బయట పడ్డారు.
ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ధనుష్, లోహిత్ , దినేష్, తాయిలు, జతిన్, మిర్గానిక్, మహమ్మద్ ఇబ్రహీం ఏడుగురు వీకెండ్ కావడంతో ఉదయం 8 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనాలపై కొండపోచమ్మ జలాశయం సందర్శనకు వెళ్లారు. ఒక్కొక్కరుగా జలాశయం నీటిలోకి దిగి అందులో కొద్ది సేపు నీటిలో స్నానాలు చేస్తూ వీడియోలు తీస్తూ జల్సాలు చేశారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కాలుజారి ఒక్కొక్కరుగా జలాశయం నీటిలో పడి గల్లంతయ్యారు. మహమ్మద్ ఇబ్రహీం, మిర్గానిక్లు ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిచ్చిన సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు గల్లంతైన వారి ఆచూకీ కోసం జలాశయంలో గాలింపు చర్యలను చేపట్టి మృతదేహాలను వెలికితీశారు.
మృతులను ధనుష్(20), లక్కీ (17), దినేష్(17), తాయిలు(20), జతిన్(17) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను వెలికి తీశారు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరూ సొంత అన్నదమ్ములు. ప్రమాదంలో మిర్గానిక్ (17), ఎండీ ఇబ్రహీం (17) మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఐదుగురి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరంతా ముషీరాబాద్, కవాడిగూడ, ఖైరతాబాద్, రాంనగర్లో ఉంటున్నారు.
ప్రమాదంలో అన్నదమ్ములు మృతి : చనిపోయిన అన్నదమ్ములైన ధనుష్, లోహిత్ భోలక్ పూర్ డివిజన్ ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి నర్సింగరావుకు ఫోటో స్టూడియో ఉంది. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. కూతురు వివాహమైంది. ధనుష్ తండ్రి ఫోటో స్టూడియో చూసుకుంటుండగా, లోహిత్ టీకేఆర్ కాలేజీలో డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈరోజు ఉదయం 8.30 గంటలకు స్నేహితులతో కలిసి బైక్‌లపై కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లారు. అదే వారి చివరి ప్రయాణమైంది.
నేతల సంతాపం : కొండపోచమ్మ ప్రాజెక్టులో ఐదుగురు యువకుల మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షించాలని, తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు కొండపోచమ్మ సాగర్ ప్రమాదంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. యుక్తవయసులోనే యువకులు అకాల మరణం చెందడం కుటుంబాలకు తీరని లోటని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు. మాజీ మంత్రి మాజీమంత్రి హరీశ్ రావు కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పండుగ వేళ బిడ్డల్ని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అటు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.