Interior Design For Home : ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకోవాలన్నదే కళ. అలా కట్టుకున్న ఇంట్లో తమకు నచ్చినట్లుగా ఇంటి బయట, లోపల చూడముచ్చటైన ఇంటీరియర్స్ చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీని కోసం రూ.లక్షలు ఖర్చవుతున్నా తగ్గేదే లే అంటున్నారు. ఇందుకోసం ఫేమస్ ఇంటీరియర్ డిజైనర్లను సంప్రదిస్తున్నారు. విపణిలో కొత్త ట్రెండ్ల గురించి తెలుసుకొని, వాటిని తమ ఇంట్లో చేయించుకుంటున్నారు.
ఎవరికి వారు తమ స్థాయికి తగిన విధంగా ఇంటీరియర్ డిజైనింగ్ చేయిస్తున్నారు. మారుతున్న కాలానుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. యువ డిజైనర్లు సరికొత్త ఆలోచనలతో వైవిధ్యమైన డిజైన్లను తయారు చేస్తున్నారు. కాదేది డిజైనింగ్‌కు అనర్హమంటూ చిత్తు కాగితాలు, వెదురు పుల్లల నుంచి ఖరీదైన మార్బుల్ స్టోన్స్ వరకు డిజైనింగ్‌లో వినియోగిస్తూ ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్నారు.
సంప్రదాయ, ఆధునిక శైలి మిళితంగా సరికొత్త కళాకృతులను రూపొందించి ఇంటిని మరింత అందంగా తయారు చేసేందుకు ఎవరికివారు పోటీపడుతున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా శుక్రవారం ఏర్పాటైన డిజైన్ డెమోక్రసీ 2024 ప్రదర్శన ఇంటీరియర్ ప్రపంచాన్ని ఒక చోట ఆవిష్కరించింది. యువ డిజైనర్లు ఎంతో మంది ఆకట్టుకునే డిజైన్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.
కాగితంతో మరింత అందం : ఒరిగామి అనేది జపాన్ కాగితపు కళ. రంగురంగుల కాగితాలతో రకరకాల బొమ్మలను, కళాకృతులను తయారు చేయడం ఈ కళ ప్రత్యేకత. ఇలాంటి కళనే ఇప్పుడు జైపూర్‌కు చెందిన యువ డిజైనర్లు ఇంటీరియర్ డిజైనింగ్‌లో వినియోగిస్తున్నారు. ఆడిగమి పేరుతో విభిన్న రంగుల కాగితాలతో చూడముచ్చటైన డిజైన్లు చేస్తున్నారు. ఇళ్లల్లో పార్టిషన్ గోడల తయారీ మొదలు డెకరేషన్ దీపాల తయారీ వరకు రకరకాల ఆకృతులతో రూపొందిస్తున్నారు. సాధారణ కాగితం మొదలు పాలీప్రొఫైలిన్, గేట్‌వే, 180 జీఎస్‌ఎం పేపర్, ఐటీసీ పేపర్ ఇలా వివిధ రకాల కాగితాలతో వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా డిజైన్లను తయారు చేస్తున్నారు.
ఇంజినీరింగ్ కాంక్రీట్‌తో ఫర్నిచర్, కళాకృతులు : దిల్లీకి చెందిన యువ డిజైనర్లు లీడెన్షాఫ్ట్ పేరిట తయారు చేసిన కళాకృతులు చాలా అందంగా ఉన్నాయి. ఇంజినీరింగ్ కాంక్రీట్(సిమెంట్ తరహా) మెటీరియల్‌తో బొమ్మలు, ఫర్నిచర్‌ను తయారు చేస్తున్నారు. చక్కటి ఫినిషింగ్‌తో చూడగానే ఆకట్టుకునే విధంగా తయారు చేసిన ఉత్పత్తులు అనేకం ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. రూ.60 వేల నుంచి రూ.3లక్షలు విలువ చేసే ఇంటీరియర్ డిజైనింగ్‌కు సంబంధించిన ఫర్నిచర్, కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దశావతార శిల్పాలు : విష్ణుమూర్తి దశావతారాలను ప్రతిబింబిస్తూ నగరానికి చెందిన డిజైనర్ స్పర్శారెడ్డి రూపొందించిన కళాకృతులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వుడ్, స్టీల్, బిద్రీ వర్క్, బ్రాస్ వర్క్ మిళితంగా రూపొందించిన దశావతార శిల్పాలు వైవిధ్యంగా ఉన్నాయి. మత్య్స, కూర్మ, నర్సింహ.. ఇలా విభిన్న అవతారాలకు అద్దంపడుతూ దశావతార సిరీస్ పేరిట రూపొందించిన శిల్పాలు మన సంస్కృతి, సంప్రదాయ విశిష్టతను చాటుతున్నాయి. ఈ శిల్పాల ఖరీదు రూ.4 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఇళ్లు, కార్యాలయాలకు మరింత శోభనిచ్చే విధంగా ఈ శిల్పాలను మలిచారు.
కూరగాయలు, పండ్లు : ఇంటీరియర్ డిజైనింగ్‌లో కూరగాయలు, పండ్లు కూడా భాగమే అంటున్నారు డిజైనర్లు. ఒరిశాకు చెందిన చిత్రకారుడు మాయాధర్‌సాహు సహజత్వం ఉట్టిపడే విధంగా తయారు చేసిన కూరగాయలు, పండ్ల బొమ్మలను ప్రదర్శనకు ఉంచారు. విలేజ్ టేల్స్ పేరిట 10 ఏళ్లు శ్రమించి వీటిని తయారు చేశారు. మార్బుల్, వుడ్, మేకులను ఉపయోగించి తయారు చేసిన వీటికి సహజసిద్ధమైన కలర్స్ అద్దడంతో చేతితో పట్టుకుంటేకానీ అవి బొమ్మలని గుర్తించలేం.
దేవతామూర్తుల చిత్రాలు : దిల్లీకి చెందిన కళాకారులు తయారు చేసిన ఎత్తైన దేవతామూర్తుల చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వారణాసి రా సిల్క్‌పై గోల్డ్ మెటాలిక్ థ్రెడ్‌తో రూపొందించిన ఈ చిత్రాలకు మీనావర్క్, కుందన్ స్టోన్స్ రెట్టింపు శోభ నిచ్చాయి. 8్ల8 వేంకటేశ్వర స్వామి చిత్రపటం రూ.14.5 లక్షలు, భగీరథుడి తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకునే ఇతివృత్తంగా రూపొందించిన చిత్రపటం ధర రూ.27 లక్షలు, శ్రీకృష్ణుడి చిత్రపటం ఖరీదు రూ.7.5 లక్షలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ చిత్రపటాలు చాలామంది ఇళ్లల్లో కార్యాలయాల్లో పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఓలీమాటీ అనే సంస్థ సిరామిక్‌తో తయారు చేసిన బొమ్మలు.. ప్రదర్శనలో కనువిందు చేస్తున్నాయి.
మార్బుల్‌తో ఫర్నిచర్ : మార్బుల్‌తో తయారు చేసిన ఫర్నిచర్‌ను చండీగఢ్‌కు చెందిన డిజైనర్లు ప్రదర్శనకు ఉంచారు. స్పైడర్ గ్రీన్ మార్బుల్‌తో తయారు చేసిన కుర్చీ, ఇటాలియన్ మార్బుల్ డెనింగ్ టేబుల్, వైట్‌మార్బుల్‌తో తయారు చేసిన కాఫీ టేబుల్ చూడముచ్చటగా ఉన్నాయి. వీటి ఖరీదు రూ.4 లక్షల నుంచి రూ.8.5 లక్షల వరకు ఉన్నాయి.
మైసూర్ రోజ్‌వుడ్ బొమ్మలు : గోడలపై కాన్వాస్ పెయింటింగ్స్‌ను పెట్టుకోవడం చాలా ఇళ్లల్లో చూస్తుంటాం. కానీ గోడలపై అందంగా తీర్చిదిద్దిన చెక్క బొమ్మలు మరింత అందాన్నిస్తాయి అంటున్నారు మైసూర్‌కు చెందిన భానుప్రకాష్ అనే కళాకారుడు. మైసూర్ రోజ్‌వుడ్ ఇన్లే అనేది సంప్రదాయ కళ.. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ కళకు ఆధునికతను జోడించి సరికొత్త బొమ్మలను తయారు చేస్తున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఈ బొమ్మల వాడకం చాలా పెరిగింది.
టేక్, రోజ్‌వుడ్, వేప ఇలా వివిధరకాల చెక్కలతో అందమైన బొమ్మలను చెక్కడం ఈ కళ విశిష్టత. కళాకారులు ఎంతో శ్రమించి తయారు చేస్తున్న ఈ చెక్క బొమ్మలను ఇళ్లల్లో, హోటల్స్, కార్యాలయాల్లో పెట్టుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. తమ వద్ద నాలుగు వేల నుంచి 30 లక్షలు విలువ చేసే బొమ్మలు ఉన్నాయి తెలిపారు. హంపీ రథం, వణ్యప్రాణుల బొమ్మలు, ప్రకృతి అందాలు, వేంకటేశ్వరస్వామి, గౌతమ్ బుద్ధ ఇలా విభిన్న చిత్రాలతో కూడిన చెక్క బొమ్మలు కళాప్రియులను కట్టిపడేస్తున్నాయి.
హైదరాబాద్‌లో 'జపాన్'ను మరిపించే ఇళ్లు! - మీ ఇంటినీ ఇలా 'స్మార్ట్'గా మార్చేయండి
Hamstech Interior Design Expo : ఇంటీరియర్ మంత్ర.. చూపరులను కట్టిపడేస్తున్న హామ్స్టెక్ ఎక్స్పో