Sarfaraz Khan Reaction On Debut Run Out :ఎంతో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ టోర్నీలో సర్ఫరాజ్ ఖాన్‌కు లభించిన అవకాశమది. కానీ అతడేమి డిఫెన్సివ్‌గా ఆడలేదు. బజ్‌బాల్ వీరులనే ఆశ్చర్యపరుస్తూ ధనాధన్ షాట్లతో చెలరేగిపోయాడు. సర్ఫరాజ్ వచ్చే సరికి జట్టు మరీ సేఫ్ సైడ్‌లో ఏమీ లేదు. అప్పటికీ భారత్ స్కోరు 237/4. వుడ్ అతడిని షార్ట్ పిచ్ బంతులతో పరీక్షించాడు. కాసేపు ఆచితూచి ఆడిన సర్ఫరాజ్ తనదైన శైలిలో యథేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. రెహాన్ బౌలింగ్‌లో ఫోర్‌తో బౌండరీల మోత మొదలెట్టాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో సర్ఫరాజ్ అలవోకగా పరుగులు రాబట్టాడు. క్రీజులో చురుకుగా కదలిన అతడు స్వీప్, లాఫ్ట్స్, పుల్స్ షాట్లతో విరుచుకుపడ్డాడు. హార్ట్‌లీ బౌలింగ్‌లో ముందుకొచ్చి అతడి తలమీదుగా సిక్స్ కొట్టిన షాట్ మాత్రం చూసి తీరాల్సిందే.
పాండ్య సరసన
కేవలం 48 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు సర్ఫరాజ్ ఖాన్. దీంతో భారత్ తరఫున అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా హార్దిక్ పాండ్య సరసన నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ జోరు చూస్తుంటే సెంచరీ కూడా తేలిగ్గానే పూర్తి చేయగలడనిపించింది. కానీ, రాని పరుగు కోసం జడేజా పిలవడం వల్ల అతడు రనౌటయ్యాడు.
ఇలా ఔటయ్యాడు
99 పరుగుల మీద ఉన్న జడేజా అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 82వ ఓవర్ అయిదో బంతిని మిడాన్‌లో ఆడి పరుగు కోసం ప్రయత్నించి క్రీజు దాటి వచ్చాడు. దీనికి స్పందించిన సర్ఫరాజ్ రన్ కోసం పరుగెత్తాడు. కానీ ఫీల్డర్‌ను చూసి జడేజా అక్కడే ఆగిపోవడం వల్ల సర్ఫరాజ్ వెనక్కి తిరిగాడు. అయితే అతడు క్రీజులోకి చేరేలోపే మార్క్‌వుడ్ మెరుపులాంటి త్రో విసిరి నేరుగా స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. దీంతో తీవ్ర నిరాశ చెందిన సర్ఫరాజ్ పెవిలియన్ చేరాడు.
కెప్టెన్ రోహిత్ అసహనం
సర్ఫరాజ్ రనౌట్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూంలో తన టోపీ తీసి నేలకు కొట్టాడు. ఇక ఈ డెబ్యూ మ్యాచ్‌లో సర్ఫరాజ్ రనౌట్ అతడి తండ్రిని, భార్యను కూడా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కాగా, ప్రస్తుతం ఈ రనౌట్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంచి టైమింగ్‌తో, టెక్నిక్‌తో ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురు దాడి చేసిన సర్ఫరాజ్ మొదటి రోజు అజేయంగా ఉంటే భారత్ పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
రనౌట్‌పై స్పందించిన సర్ఫరాజ్
రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం వల్లే సర్ఫరాజ్ పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. మూడో టెస్టు తొలి రోజు మ్యాచ్ అనంతరం విలేకర్ల సమావేశంలో సర్ఫరాజ్ తన రనౌట్‌పై స్పందించాడు. 'జడేజాతో ఆడుతున్న సమయంలో మా మధ్య కాస్త అవగాహన లోపించింది. క్రికెట్‌లో ఇలాంటివి మామూలే. ఎవరో ఒకరు రనౌట్‌గా పెవిలియన్ చేరుతారు. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. బ్యాటింగ్ చేసేటప్పుడు రవీంద్ర జడేజా నాకు మద్దతుగా నిలిచాడు. నాకు పలు సూచనలూ ఇచ్చాడు. వాటిని పాటిస్తూ ముందుకు సాగా. అంతకుముందు లంఛ్ బ్రేక్‌లోనూ జడ్డూతో బ్యాటింగ్ గురించి చర్చించా. అరంగేట్రం చేసిన ప్లేయర్ ఏ విధంగా ఒత్తిడికి గురి అవుతాడో జడేజాకు తెలుసు. దాని నుంచి ఎలా బయటపడాలో కూడా తెలిసిన ఆటగాడు అతడు. ఈ మ్యాచ్‌లో తొలిసారి స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించి విఫలమయ్యా. అప్పుడు నా దగ్గరకు వచ్చి కాస్త సమయం తీసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ తేలికవుతుందని వివరించాడు. ఈ సూచన్నలన్నింటినీ అమలు చేసేందుకు ప్రయత్నించా' అని వివరించాడు. ఈ మ్యాచ్‌లో 66 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 62 పరుగులు చేశాడు ఈ యూపీ కుర్రోడు.
'నా డెబ్యూలో నేనూ రనౌటయ్యా'
సర్ఫరాజ్ రనౌట్పైఒక పోస్ట్ మ్యాచ్ షోలో కామెంట్ చేశాడు భారత దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే. 'జడేజాతో సర్ఫరాజ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒక్కసారి పరుగులు చేయడం ప్రారంభించాక ఆధిపత్యం ప్రదర్శించాడు. దీంతో జడేజా కాస్త కన్ఫ్యూజన్కు గురైనట్లు అనిపించింది. తాను కూడా దూకుడుగా ఆడాలనే మైండ్‌సెట్‌లో నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి. అందుకే, వారి మధ్య సమన్వయ లోపం వచ్చిందని అనుకుంటున్నా. ఇలా ఒక డెబ్యూ బ్యాటర్ ఔట్ అవ్వడం దురదృష్టకరం. నేను కూడా నా తొలి అరంగేట్ర మ్యాచ్‌లో రనౌట్ కావడం వల్లే పెవిలియన్‌కు చేరా. కనీసం సర్ఫరాజ్ 62 కొట్టాడు' అని నవ్వుతూ వ్యాఖ్యానించాడు
ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(110)-212 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు, కుల్దీప్ యాదవ్(1) ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌వుడ్(3/69) మూడు వికెట్లు తీశాడు. టామ్ హార్ట్‌లీ ఒక వికెట్ పడగొట్టాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్ దారుణంగా విఫలమయ్యారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు.
సర్ఫరాజ్‌కు జడ్డూ సారీ - తన వల్లే ఔటయ్యాడంటూ పోస్ట్!
సర్ఫరాజ్ జెర్సీ 'నెం.97'- దీని స్పెషాలిటీ ఎంటో తెలుసా?