Delhi Assembly Polls 2025 : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు మూడు పార్టీలు పోటాపోటీగా పార్టీలు ఉచితాలను ప్రకటించాయి. ఇక్కడ ఒక అడుగు ముందుకేసి ఎన్నికలకు ముందుగానే పార్టీలు అర్హులను గుర్తించే దరఖాస్తుల ప్రక్రియను చేపట్టాయి. గతంలోనే ఉచిత హామీలతో రెండుసార్లు విజయం సాధించిన ఆప్ ఈసారి మరిన్ని గ్యారంటీలను ఇచ్చింది. ఆప్‌నకు పోటీగా బీజేపీ ఉచిత వరాల వాన కురిపించింది. కాంగ్రెస్ పార్టీ తాను తక్కువ తిన్నానా అన్నట్లు ఉచితాలను కుమ్మరించింది. కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. ఎన్నికలు సమీపించిన వేళ చివర్లో కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను మినహాయింపును రూ.12 లక్షలకు పెంచడం ద్వారా బీజేపీ బౌన్సర్ వేసింది.
ఆప్‌నకు సవాల్
అధికార ఆప్‌నకు దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకరకంగా సవాలే అని చెప్పొచ్చు. పలువురు ఆప్ నేతలపై అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. బీజేపీ ఈ విషయానే ప్రచార అస్త్రంగా మార్చుకుంది. విద్య, వైద్యంలో చేపట్టిన చర్యలతోపాటు ఉచిత విద్యుత్, తాగునీరు గత రెండు ఎన్నికల్లో అద్భుత ఫలితాలనిచ్చాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమూ ఫలించింది. ఈసారీ అదే బాటలో ఆప్ పయనిస్తోంది. మహిళలకు నెలకు రూ.2,100 చొప్పున ఇస్తామని ప్రకటించింది. దిల్లీలో చాలా మంది ఓటర్లు కలుషిత నీరు, దారుణమైన రోడ్ల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలతాయన్న ఆందోళన ఆప్‌లో ఉంది. కాంగ్రెస్ తమను దెబ్బ తీస్తుందేమోనన్న భయం ఆ పార్టీని వెంటాడుతోంది.
ఉనికి కోసం కాంగ్రెస్
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన కాంగ్రెస్ మరోసారి ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. ఆప్, బీజేపీ మధ్య పోరులో కాంగ్రెస్ ఊసులో లేకుండా పోతోంది. దళితులు, మైనారిటీల ఓట్లను తిరిగి సంపాదించేందుకు నాయకులు, అభ్యర్థులు బాగానే కష్టపడుతున్నా ఎంత వరకు ఫలితమిస్తుందన్నది చూడాలి.
బీజేపీ విశ్వప్రయత్నాలు
1998 నుంచీ దిల్లీలో అధికారంలో లేకపోవడం వల్ల ఈసారి ఎలాగైనా పట్టు సాధించడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తనకు బలమున్న నియోజకవర్గాలపైనే కాకుండా ఆప్ బలంగా ఉన్న వాటిపైనా దృష్టి సారించింది. గతంతో పోలిస్తే ఈసారి బీజేపీ బాగానే పుంజుకొన్నా ఆ పార్టీలో కేజ్రీవాల్‌ను ఢీకొట్టగలిగే నేత లేకపోవడం ఇబ్బందిగా మారింది. పలు నియోజకవర్గాల్లో కీలక నేతలను పోటీకి దింపినా ఎవరినీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు. పార్టీలోని అంతర్గత కలహాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని అంటున్నారు. దీంతోపాటు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు సమర్థులు కారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. బడ్జెట్‌లో ఆదాయ పన్ను మినహాయింపు ద్వారా దిల్లీలోని మధ్యతరగతిని బీజేపీ ఆకట్టుకుంది. ఇది కేజ్రీవాల్‌కు భారీ షాకే. అసలే దిల్లీలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువ. 67శాతం మంది వారే.