Basara Kshetra Mahima : మహా పుణ్యక్షేత్రం బాసర చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువున్న పవిత్ర ప్రదేశం. జ్ఞానాన్ని, విద్యను ప్రసాదించే సరస్వతీదేవి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే వారికి చదువు బాగా అబ్బుతుందని, భవిష్యత్తులో గొప్ప ప్రయోజకులు అవుతారని విశ్వాసం. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు బాసర జ్ఞాన సరస్వతీ దేవిని దర్శించుకుంటారు. వసంత పంచమి సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆలయ స్థల పురాణం
ఒకానొక సమయంలో వ్యాస మహర్షి ఈ ప్రాంతంలో సంచరించారని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాసర ఆలయం, ఆలయ స్థల పురాణం గురించి వివరంగా తెలుసుకుందాం.
పౌరాణిక గాథ
బాసర ఆలయం స్థల పురాణం గురించి తెలుసుకోవాలంటే, ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్న పౌరాణిక గాథ తప్పకుండా తెలుసుకోవాలి.
సరస్వతి దేవి మహిమతో తప్పుగా వరం కోరిన కుంభకర్ణుడు
త్రేతాయుగంలో రామాయణ కాలానికి సంబంధించిన కుంభకర్ణుని వృత్తాంతం అందరికీ తెలిసిందే. కుంభకర్ణుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని సంతుష్టుని చేసి, తనకు మృత్యువు అనేది లేకుండా ఎప్పటికీ జీవించే ఉండాలని వరం కోరుకున్నాడు. కానీ ఆ వరమివ్వడం బ్రహ్మదేవునికి ఇష్టం లేదు. కుంభకర్ణుడు పట్టు వదలకుండా తాను కోరుకున్న వరం పొందేందుకు తపస్సు కొనసాగించాడు. బ్రహ్మదేవుడు యుక్తితో సరస్వతీ దేవిని వేడుకున్నాడు. లోకకంటకుడైన కుంభకర్ణుడు వరం కోరే సమయంలో, అతని వాక్కును తారుమారు చేయమని వాగ్దేవికి సూచించాడు. కుంభకర్ణుడు మృత్యుంజయత్వం వరాన్ని కోరుకోబోయి, వాగ్దేవి ప్రభావం వల్ల, నిద్రను కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు ''తథాస్తు'' అన్నాడు. అలా లోకకంటకుడైన కుంభకర్ణుని తామస శక్తిని అణచి, లోకోపకారానికి సరస్వతీ దేవియే కారణమని ఈ గాథ ద్వారా తెలుస్తోంది.
నారదుని సందేహాన్ని తీర్చిన బ్రహ్మ
నారద పురాణం ప్రకారం ఒకసారి నారదునికి బాసరలో సరస్వతీదేవిని ఎవరు ప్రతిష్టించారో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందంట! అప్పుడు నారదుడు బ్రహ్మను బాసరలో సరస్వతీ దేవి వెలసిన వృత్తాంతం, అష్టతీర్థ మహిమలు తెలుపవలసిందిగా కోరాడు. అప్పుడు బ్రహ్మ ఒకానొక సమయంలో ఈ ప్రాంతంలో వ్యాసుడు నివసించిన కారణంగా ఈ ప్రాంతాన్ని 'వ్యాసపురి' అని పిలిచేవారని, ఇప్పటికీ 'వాసర' లేక 'బాసర' అని పిలుస్తున్నారని తెలిపారు. అలాగే ఇక్కడి సరస్వతీదేవి విగ్రహాన్ని వ్యాసుడు స్వయంగా ప్రతిష్టించాడని చెప్పాడు. అప్పుడు నారదుడు బ్రహ్మతో బాసరలో సరస్వతీ దేవి స్వయంగా ఆవిర్భవించిందని కొందరు, అమ్మవారిని వ్యాసుడే ప్రతిష్టించాడని కొందరు పరస్పర విరుద్ధంగా ఎందుకు చెబుతున్నారు, ఈ సందేహాన్ని తీర్చమని ప్రార్థించాడంట! అప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షితో సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్టను వ్యాసుడు ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించాడు.
బాసరలో స్వయంభువుగా వెలసిన చదువుల తల్లి
ఆదికాలంలో సరస్వతి దేవికి బాసర యోగ్యమైన ప్రదేశంగా తలచి అక్కడే వెలసిందంట! ప్రతి నిత్యం బ్రహ్మాది దేవతలు బాసరకు వచ్చి సరస్వతి దేవిని సేవిస్తూ ఉండేవారు. ఒకనాడు సరస్వతీ దేవి తన మహిమను ప్రకటించేందుకు, ఆలయం నుంచి అంతర్థానమైంది. అప్పుడు మహర్షులు, దేవతలు, బ్రహ్మదేవుని వద్దకు వచ్చి శారదాదేవి అంతర్థానం గురించి వివరించి, మరోసారి సరస్వతీ దేవి అనుగ్రహం పొందేందుకు మార్గం సూచించమని వేడుకున్నారు. వారి ప్రార్థన మేరకు బ్రహ్మదేవుడు వేదవ్యాసుని వలన సరస్వతీ దేవి తిరిగి వస్తుందని చెప్పి, వారిని వ్యాసమహాముని దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించారు.
వ్యాసుని ఆశ్రయించిన దేవతలు
బ్రహ్మ సూచన మేరకు దేవతలు, మహర్షులు, వేదవ్యాసుని వద్దకు వెళ్ళారు. వారిని చూసిన వేదవ్యాసుడు వారి మనోభావం గ్రహించి నిశ్చల చిత్తంతో వాగ్దేవిని ధ్యానించాడు. అప్పుడు ఆ సరస్వతి ప్రసన్నురాలై వ్యాసునితో పవిత్ర గోదావరి తీరంలోని బాసరలో తన సైకత విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించమని, తన విగ్రహాన్ని ప్రతిష్టించే శక్తిని వ్యాసునికి అనుగ్రహిస్తున్నానని తెలిపింది.
వ్యాస ప్రతిష్టిత సరస్వతి దేవి
అంతట వ్యాసుడు సమస్త ఋషి గణాలతో, దేవతలతో కలిసి గౌతమీ తీరం చేరాడు. గౌతమీ నదిలో స్నానమాచరించి, జ్ఞాన సరస్వతీ దేవి రూపాన్ని నిశ్చల మనస్కుడై ధ్యానించి, విగ్రహాన్ని ప్రతిష్టించాడు. వ్యాసుడు విగ్రహం ప్రతిష్ఠించిన కారణంగా ఈ క్షేత్రానికి 'వ్యాసపురి' అనే పేరు స్థిరపడింది. ఈ వ్యాసపూరినే కాలక్రమేణా 'వాసర' అని 'బాసర' అని పిలవసాగారు.
నిత్య పూజోత్సవాలు
బాసరలో నిత్యం ఉదయం ఐదు గంటలకు సరస్వతీ దేవి మూల మూర్తికి వైదిక మంత్రోపేతంగా పంచామృతంతో అభిషేకం, ధూపదీపాలతో షోడశోపచార పూజ నయనానందకరంగా చేస్తారు. ఈ పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
విశేష ఉత్సవాలు
బాసరలో ముఖ్యంగా ప్రతి సంవత్సరం మూడు ఉత్సవాలు జరుగుతాయి.
సరస్వతీ జన్మదినోత్సవం – శ్రీ పంచమి
మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమి లేక శ్రీ పంచమి అంటారు. బాసరలో శ్రీ పంచమి రోజు శ్రీ సరస్వతీదేవి జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుతారు.
మహాశివరాత్రి ఉత్సవం
బాసరలో మహాశివరాత్రి పర్వం మొదలుకొని మూడు రోజుల పాటు గొప్ప జాతర జరుగుతుంది. వేలాది భక్తులు పవిత్ర గోదావరిలో స్నానం చేసి పతితపావని అయిన వాగ్దేవికి ప్రదక్షిణాలు చేస్తూ పునీతులవుతారు.
శరన్నవరాత్రులు
బాసరలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉదయం, సాయంకాలం శారదా దేవికి చతుష్షష్టి ఉపచారాలతో వైదిక పద్ధతిలో వైభవోపేతంగా అర్చన జరిపిస్తారు. శ్రీదేవి భాగవతం, దుర్గా సప్తశతి పారాయణం, మహర్నవమి రోజున చండీ వాహనం సశాస్త్రీయంగా చేస్తారు. విజయదశమి రోజున వైదిక మంత్రంతో మహాభిషేకం, సుందరమైన అలంకారం, సాయంత్రం పల్లకీసేవ, శమీ పూజ మొదలైనవి నయనానందకరంగా జరుగుతాయి.
అక్షరాభ్యాసం
ముఖ్యంగా బాసరలో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు చదువు బాగా వంటబడుతుందని విశ్వసిస్తారు. అమ్మవారికి భక్తితో పలక-బలపం, కాగితం, కలం సమర్పిస్తుంటారు.
ఇతర దర్శనీయ స్థలాలు
బాసర ఆలయం పరిసర ప్రాంతాలలో శ్రీ దత్తాత్రేయ స్వామి దివ్య విగ్రహం, దత్తపాదుకలు, మహాకాళీ దేవాలయం, వ్యాస మందిరం, శివాలయం దర్శనీయ స్థలాలు.
రానున్న వసంత పంచమి సందర్భంగా బాసర క్షేత్రాన్ని దర్శిస్తే విద్యాబుద్ధులు కలగడం ఖాయమని భక్యుల విశ్వాసం. - ఓం శ్రీ సరస్వతి దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.