Magha Pournami 2025 Significance: హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీకం తర్వాత అంతటి పవిత్రమైనది మాఘమాసం. కార్తీక మాసం దీపాలకు, దీపారాధనకు ప్రసిద్ధి ఎలాగో, మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. మాఘమాసంలో వచ్చే మాఘ పూర్ణిమకు కూడా విశిష్ఠ ప్రాధాన్యత ఉంది. మాఘ పౌర్ణమిని మహా మాఘి అని కూడా పిలుస్తారు. మరి ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఎలాంటి విధివిధానాలు పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మాఘ పూర్ణిమ తేదీ: ఈ ఏడాది(2025) మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం వచ్చింది. మాఘ పూర్ణిమ తిథి ఫిబ్రవరి 11న సాయంత్రం 6:55 గంటలకు మొదలై, 12 ఫిబ్రవరి బుధవారం సాయంత్రం 7:22 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
మాఘపూర్ణిమ రోజు పాటించాల్సిన విధివిధానాలు:
- శక్తివంతమైన మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం చేయాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. సముద్ర స్నానం చేయలేని వారు కనీసం నది స్నానమైన చేయాలని సూచిస్తున్నారు. సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసే సమయంలో ఓ కరక్కాయను నీటిలో వేస్తే మీకున్న దిష్టి, దోషాలు, నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని చెబుతున్నారు.
- పౌర్ణమి రోజు సముద్ర, నదీ స్నానం చేయలేని వారు కనీసం తిలదానమైనా ఇవ్వాలని చెబుతున్నారు. తిల దానం అంటే నువ్వులను దానం చేయడం. ఒకటింపావు కేజీ నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో మూట కట్టి దేవాలయంలో పండితులకు దానం ఇవ్వాలని అంటున్నారు. ఒకవేళ ఆలయంలో పూజారులు అందుబాటులో లేకపోతే నువ్వులను ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు.
- మాఘ పౌర్ణమి పార్వతీ దేవికి ఇష్టమైన రోజని మాచిరాజు చెబుతున్నారు. కాబట్టి ఏదైనా సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆడపిల్లలు ఈ తిథి రోజున పార్వతీ దేవిని పూజిస్తే మంచి జరుగుతుందని అంటున్నారు. తమలపాకులో పసుపు ముద్ద ఉంచి, ఆ పసుపు ముద్దను గౌరీ దేవిగా భావించాలి. ఆ తర్వాత గంధం, కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించాలి. ఆపై అక్షతలు వేస్తూ ఓం శ్రీ గౌరీ దేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి, హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల దాంపత్య సమస్యలు వంటివి తీరతాయని చెబుతున్నారు.
- పెళ్లి కావాల్సిన అమ్మాయిలు మాఘ పౌర్ణమి రోజు గౌరీ దేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గౌరీ దేవి అనుగ్రహం లభిస్తుందని, వివాహ ప్రయత్నాలు విజయవంతం అయ్యి తొందరలోనే పెళ్లి జరుగుతుందని అంటున్నారు.
- మాఘ పౌర్ణమి రోజు నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లి గురుగ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని అక్కడ ఉంచాలి. అయితే ఇలా చేయలేని వారు ఇంట్లో ఈశాన్యం మూలలో ఓ దీపాన్ని వెలిగిస్తే సరిపోతుందని చెబుతున్నారు. అందుకోసం, ఈశాన్య మూలలో ఓ చిన్న పీట ఉంచి, దాని మీద బియ్యప్పిండి ముగ్గు వేసి మట్టి ప్రమిద ఉంచాలి. ఆ ప్రమిదలో ఆవునెయ్యి పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించడం వల్ల జాతకంలో ఉన్న గురు గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మాఘ స్నానంతో సౌందర్యవతిగా మారిన తొండ- ఈ కథ తెలుసా?
"మిమ్మల్ని నరదిష్టి వేధిస్తోందా? - ఈ ఉంగరం ధరిస్తే ఇట్టే తొలగిపోతుంది"