Ration Card Applications in Telangana : తెలంగాణలో ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి. తెల్లరేషన్ కార్డు కలిగిన వారిని పేదలుగా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంటాయి. రేషన్ పంపిణీ దగ్గర నుంచి సంక్షేమ పథకాల్లో సబ్సిడీ వరకూ ఈ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటారు. ఆరోగ్యశ్రీతో వైద్య సేవలు, ఇందిరమ్మ ఇళ్లు ఇలా అన్నీ రేషన్కార్డుతోనే ముడిపడి ఉన్నాయి. దీంతో ప్రజలు ముందు ఎలాగైనా రేషన్ కార్డులు పొందాలని దరఖాస్తులు ఇచ్చేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
కార్డుల పంపిణీపై స్పష్టత లేదు : అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామంటూ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌ల ప్రకటనలతో రోజూ వందల మంది తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాలకు వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది తప్ప, కార్డుల పంపిణీపై స్పష్టత ఇవ్వలేదంటూ అధికారులు వారికి తెలుపుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ప్రజలు మండల కేంద్రాలకు వస్తుండటంతో ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని, పంచాయతీ కార్యాలయాల్లో అందజేయాలని చెబుతున్నారు.
రేషన్ కార్డుల దరఖాస్తులకే డిమాండ్ : ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు గ్రామ, వార్డు సభలు నిర్వహించగా, వాటిలో రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో అంతకు ముందు, ఇంటింటి సర్వేతో కలిపి రేషన్ కార్డుల సర్వే కోసం రెండు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే జిల్లాలో 5.58 లక్షలుంటే కొత్తగా భారీ సంఖ్యలో రావడంతో వాటిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
వైద్యావసరాలకు రేషన్ కార్డు ముఖ్యం : ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏదైనా వైద్య సేవలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. ఏవైనా ప్రభుత్వ పథకాలు రావాలన్నా కార్డు ఉండాల్సిందే. దీంతో ప్రజలు ఎక్కువ దరఖాస్తులు చేస్తున్నారు. ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, కుమారుడు, కోడలు ఉంటే తాము విడిగా ఉంటున్నామంటూ దంపతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కోసం రేషన్ కార్డు ఆదాయ ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడుతుందన్న నమ్మకంతో దరఖాస్తు చేస్తున్నారు.
కొత్త రేషన్ కార్డు కావాలంటే ఆ పత్రాలు కచ్చితంగా ఉండాల్సిందే - అయోమయంలో అర్జీదారులు
రేషన్‌కార్డు కోసం అప్లై చేశారా? - మీకో గుడ్‌న్యూస్ - త్వరలోనే మీ దరఖాస్తులకు మోక్షం!