Sachin Tendulkar Birthday :ఇండియాలో చాలా మంది క్రికెటర్లుగా మారడానికి, ప్రపంచంలో చాలా మంది క్రికెటర్లుగా రాణించడానికి అతడే కారణం. ప్రత్యక్షంగా వారి ఎదుగుదలకు అతడు చేసింది ఏమీ లేకపోయినప్పటికీ, పరోక్షంగా వారికి తన ఆటతో పంచిన స్ఫూర్తి మాత్రం వెలకట్టలేనిది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, అవును మనం మాట్లాడుతోంది క్రికెట్ గాడ్ 'సచిన్ తెందూల్కర్' గురించి. ఏప్రిల్ 24న సచిన్ పుట్టిన రోజు. ఈ ఏడాది సచిన్ 44వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. అయితే సచిన్ క్రికెట్ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతను సాధించిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు ప్రతి క్రికెట్ అభిమానికి పరిచయమే. కానీ సచిన్ లవ్‌స్టోరీ గురించి మీకు తెలుసా ?
ఏయిర్‌పోర్ట్‌లో తొలిచూపు
సచిన్, తన సతీమణి అంజలీని ముంబయి ఇంటర్నేషనల్ ఆమెను తొలిసారి ఎయిర్‌పోర్టులో చూశాడు. తొలి చూపులోనే ప్రేమించాడట. అది 1990. సచిన్, తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ గేమ్ ఆడి తిరిగి వస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అంజలి తన తల్లిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చారు. అప్పుడే ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. చూడగానే ఒకరిపై ఒకరికి తెలియని ఆకర్షణ మొదలైందట. ఆ తర్వాత అనుకోకుండా ఇద్దరూ, ఒక కామన్ ఫ్రెండ్ ఇంట్లో కలిశారు. అక్కడి నుంచే వారి ప్రేమ కథ మొదలైంది.
ఆ క్వాలిటీ సచిన్‌కు బాగా నచ్చింది
"నాకు క్రికెట్ గురించి ఏమీ తెలియదు. నాలోని ఆ లక్షణమే సచిన్ నన్ను ఇష్టపడటానికి మొదటి కారణం." అంటూ అంజలి ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆ ఇద్దరూ డేటింగ్ ప్రారంభించాక, అంజలి పూర్తిగా క్రికెట్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. ఆ రోజుల్లో వారి మధ్య ఉన్న ఏకైక కమ్యూనికేషన్ లెటర్లు మాత్రమే. అందుకే రిలేషన్‌లో ఉన్న సమయంలో సచిన్‌కు తరచూ ఆమె చాలా ప్రేమ లేఖలు రాశారు. అంజలికి ఓ ఫోన్ కాల్ చేయడానికి చాలా దూరం నడవాల్సి వచ్చేదట. దాదాపు 5 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఈ జంట 1995లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.