Rinku Singh Engagement : టీమ్‌ఇండియా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్- పార్లమెంట్ మెంబర్ ప్రియా సరోజ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని కథనాలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఎంపీ ప్రియా సరోజ్ తండ్రి తూఫాని సరోజ్ స్పందించారు. ఇవన్నీ ఫేక్ వార్తలని, ఇలాంటి పుకార్లను నమ్మవద్దని పేర్కొన్నారు.
'ప్రియా నిశ్చితార్థం రింకూ సింగ్‌తో జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ పుకార్లే. అయితే పెళ్లి సంబంధం కోసం ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగిన మాట వాస్తవం. కానీ, ఎంగేజ్మెంట్ అయ్యిందనే మాట పూర్తిగా అబద్ధం. ఈ పుకార్లను నమ్మవద్దు' అని తుఫాన్ సింగ్ క్లారిటీ ఇచ్చారు.
ఎవరీ ప్రియా సరోజ్?
ప్రియా సరోజ్(26) ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజకీయవేత్త, న్యాయవాది. ఆమె సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సభ్యురాలు. 25 ఏళ్లకే పార్లమెంటులో అడుగు పెట్టారు. అతిచిన్న వయస్సులో ఎంపీ అయిన వారిలో ఒకరిగా నిలిచారు. లోక్‌సభ ఎన్నికల్లో మచ్‌లిషహర్ నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ లీడర్ బీపీ సరోజ్‌ని ఓడించి, తన కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ముందు, ప్రియా న్యాయవాద వృత్తిలో రాణించారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఆమె దిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి, తూఫాని సరోజ్ అదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1999, 2004, 2009లో ఎంపీగా సేవలు అందించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.
Rinku Singh Journey : రింకూ సింగ్ భారత క్రికెట్‌లో ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో స్టార్‌గా ఎదిగాడు. అలీగఢ్‌లో ఓ సాధారణ పేద కుటుంబంలో రింకూ జన్మించాడు. క్రికెట్ శిక్షణ, అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. ఐపీఎల్‌లో సక్సెస్ అయిన తర్వాత రింకూ లైఫ్ మారిపోయింది. ఇటీవల రింకూ తన కుటుంబం కోసం అలీగఢ్‌లో కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు. రింకూ అసాధారణ ప్రదర్శన తర్వాత 2025 ఐపీఎల్ సీజన్ కోసం KKR అతడిని రిటైన్ చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు కూడా రింకూ ఎంపికయ్యాడు.