Magha Puranam 21th Chapter : శ్రీహరి నిర్మాల్యాన్ని తొక్కిన పాపానికి కుంటివాడైన ఇంద్ర దూత పారిజాత వృక్షం కిందనే నిద్రాహారాలు లేకుండా మూడు రోజుల పాటు అలాగే ఉండిపోయాడు. ఇటు స్వర్గంలో ఇంద్రుడు మూడు రోజులుగా ఇంద్ర దూత రాకపోవడం, పారిజాత పూలు తేకపోవడం వల్ల ఏమి జరిగిందో తెలియక దేవతలతో సమావేశమవుతాడు. అందరు కలిసి చర్చించి దూతను వెతకడానికి భూలోకానికి వెళ్లడానికి నిర్ణయించుకుంటారు.
భూలోకానికి పయనమైన ఇంద్రాది దేవతలు
ఇంద్రుడు ఐరావతం ఎక్కి, కొంతమంది దేవతలతో కలిసి పారిజాత వృక్షం ఉన్న సత్వజిత్తు పుష్ప వాటికకు చేరుకుంటారు. అక్కడ మనోహరమైన పూలతో సుందరంగా ఉన్న పారిజాత పూలను చూసి ఇంద్రాది దేవతలు ఆ పూలను కోయసాగారు. పూలు కోసే సమయంలో పారిజాత వృక్షం కింద ఉన్న విష్ణు నిర్మాల్యానికి దేవతల పాదస్పర్శ తగలడం వల్ల వారంతా ఆకాశ గమన శక్తిని కోల్పోయి కుంటి వారుగా మారిపోయారు. వాహనాలతో సహా ఎటూ కదలలేక స్వర్గానికి పోలేక విచారించసాగారు.
దేవతలను చూసి సత్వజిత్తు ఆశ్చర్యం
ఇంతలో సత్వజిత్తు పుష్పవాటికకు వచ్చి దురవస్థ పాలైన ఇంద్రాది దేవతలను చూసి ఆశ్చర్యపోయాడు. వారికి అంజలి ఘటించి "దేవతలారా! మీరు కేవలం పారిజాత పూల కోసం ఇటువంటి దురవస్థను లోనవడం ఆశ్చర్యంగా ఉంది" అనడం వల్ల దేవతలు సిగ్గుతో తలవంచుకుంటారు. చేసేదేమి లేక సత్వజిత్తు తన కుటీరానికి వెళ్లిపోతాడు. కానీ దేవతలు మాత్రం ఆకలి తీర్చే అమృతం లేక, వేరే ఇతర ఆహారం లేక స్వర్గానికి తిరిగి వెళ్లే శక్తిని కోల్పోయి, కుంటివాళ్లుగా మరి నరకయాతన పడసాగారు. ఇలా 10 రోజులు గడిచింది. ఆహారం లేక దేవతలు క్రుంగి కృశించి మూర్ఛపోయారు.
సత్వజిత్తు ఉపవాసం
దేవతలకు కలిగిన ఈ దురవస్థను చింతించిన సత్వజిత్తు పారిజాత వృక్షం కింద ఉన్న విష్ణు నిర్మాల్యాన్ని శుభ్రంగా తుడిచి, దేవతలకు మేలు కలగడం కోసం తన భార్యతో కలిసి ఉపవాసం చేసాడు.
పారిజాత వృక్షాన్ని కదిలించలేకపోయిన దేవతలు
ఇటు స్వర్గంలో మిగిలిఉన్న దేవతలు ఇంద్రాది దేవతల ఆచూకీ తెలియక వారిని వెతుకుతూ భూలోకానికి బయల్దేరి వస్తారు. సత్వజిత్తు పుష్పవాటికకు చేరుకున్న వారు పారిజాత వృక్షం కింద మూర్ఛ పడిఉన్న దేవేంద్రుడు ఇతర దేవతలను చూసి వారి దురవస్థను విచారించి ఆగ్రహంతో పారిజాత వృక్షాన్ని పెకిలించసాగారు. వారి బలమంతా ప్రయోగించినా సరే వారు పారిజాత వృక్షాన్ని అంగుళం కూడా కదపలేకపోయారు. ఎంతమంది కలిసి ఎన్నిసార్లు ప్రయత్నించినా పారిజాత వృక్షాన్ని దేవతలు ఏమీ చేయలేకపోయారు.
నారాయణునికి విన్నవించిన నారదుడు
ఆకాశమార్గాన వెళ్తున్న నారదుడు ఇదంతా చూసి విష్షు లోకాని వెళ్లి విష్ణువును పరిపరివిధాలుగా స్తుతిస్తాడు. సకలం తెలిసిన నారాయణుడు ఏమి తెలియనట్లుగానే నారదుని రాకకు కారణం అడుగుతాడు. అప్పుడు నారదుడు "ఓ పరంధామా! ఇంద్రాది దేవతలు చేయరాని పని చేసి గొప్ప ఆపదలో చిక్కుకున్నారు. భూలోకంలో క్షీరసాగర సమీపంలో పారిజాత వృక్షం కలదు. ఆ చెట్టు పూలు చాలా మనోహరంగా ఉంటాయి. ఆ పూల మీద వ్యామోహంతో ఇంద్రుడు ఆ పూలను దొంగతనంగా స్వర్గానికి తెప్పించుకొని అనుభవిస్తుండేవాడు. పూలు తెచ్చే దూత రాకపోవడంతో ఇంద్రాది దేవతలు భూలోకానికి వచ్చి పారిజాత వృక్షం కింద స్వర్వ శక్తులు కోల్పోయి, మూర్చిల్లి పడిఉన్నారు. ఇంద్రుడు లేక స్వర్గం వెలవెలబోతోంది. కరుణతో వారిని అనుగ్రహించి రక్షింపుము" అన్న నారదుని మాటలు విని శ్రీహరి ఇలా పలికాడు.
ఇంద్రాది దేవతలకు శాపోపశమనం చెప్పిన శ్రీహరి
నారదుని మాటలు విన్న శ్రీహరి నారదునితో "నారదా! క్షీరసాగర మధన సమయంలో ఉద్భవించిన అమృతం నుంచి రెండు చుక్కలు పడిన ప్రాంతంలో పారిజాత వృక్షం, తులసి వృక్షం పుట్టాయి. ఈ పవిత్ర వృక్షాలను సత్వజిత్తు అనే శూద్రుడు నీరు పోసి సంరక్షించాడు. ఇంద్రుడు మాయతో తన దూత ద్వారా మోసంతో పారిజాత పూలను తెప్పించుకునేవాడు. ప్రతిరోజూ పూలు మాయం కావడం చుసిన సత్వజిత్తు నా పూజలో వాడిన పత్రపుష్పాది నిర్మాల్యాన్ని ఆ చెట్టు కింద చల్లాడు. ఇంద్ర దూతతో సహా ఇంద్రాది దేవతలు నా పూజ నిర్మాల్యాన్ని తొక్కడం వలన వారికీ గతి పట్టింది. ఎవరైనా సరే తెలిసి కానీ, తెలియక కానీ నా పూజలో ఉపయోగించిన గంధ పుష్ప తులసి దళాలను పాదాలతో తొక్కితే వారు సర్వశక్తులు నశించి కుంటి వారు అవుతారు. సత్వజిత్తు దేవతలకు కలిగిన దురవస్థను చింతించి పారిజాత చెట్టు కింద ఉన్న నిర్మాల్యాన్ని తుడిచివేసాడు. ఆకలిదప్పులతో బాధపడుతున్న దేవతల కోసం అతను కూడా తన భార్యతో కలిసి ఉపవాసం ఉన్నాడు. ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు దేవతలు ఇలా పది రోజులుగా పస్తులున్నారు. నేడు పరమ పవితమైన ఏకాదశి తిధి. ఈ రోజు సత్వజిత్తు ఉపవసించి నన్ను పూజించి, నా సన్నిధిలో నారాయణ మంత్రం జపిస్తూ జాగరణ చేస్తే నేను అతనికి ప్రసన్నుడనవుతాను. అటు తర్వాత అన్ని శుభాలే జరుగుతాయి". అని శ్రీహరి నారదునికి దేవతలకు శాపం తొలగిపోయే మార్గం చెబుతాడు. ఇక ముగించాడు.
ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! ఏకవింశాధ్యాయ సమాప్తః
ఓం నమః శివాయ
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం