Virat Kohli Injury : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కోహ్లీ మెడ నరం పట్టేసిందని వార్తలు వస్తున్నాయి. దీని కోసం విరాట్ ఇంజెక్షన్ కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే కోహ్లీ గాయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ, ఇది నిజమైతే మాత్రం అతడు రంజీ ట్రోఫీలో ఆడడం అనుమానమే!
మరోవైపు రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్‌లోని రెండు మ్యాచ్‌లకు దిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రిషభ్ పంత్‌తోపాటు, విరాట్‌కు చోటు దక్కింది. కానీ, మెడ నొప్పి కారణంగా విరాట్ బరిలో దిగడం కష్టమేనని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే విరాట్ బరిలో దిగగపోయినా, దిల్లీ జట్టుతో కలిసి ఉంటాడని సమాచారం. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు విరాట్ గాయపడడం అభిమానులను కలవర పెడుతోంది.
అందరూ ఆడాల్సిందే!
టీమ్ఇండియా ప్లేయర్లందరూ రంజీల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, రిషభ్ పంత్ తమతమ జట్ల తరఫున బరిలో దిగనున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ముంబయి జట్టు తరఫున బరిలో దిగనున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మరి విరాట్ గాయాన్ని పరిగణలోకి తీసుకొని మినహాయింపు ఇస్తుందా? అనేది చూడాలి.
కాగా, విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012లో రంజీ ట్రోఫీలో ఆడాడు. అప్పటి నుంచి మళ్లీ దేశవాళీలో విరాట్ ఆడలేదు. ఒకవేళ ఇప్పుడు బరిలో దిగితే, దాదాపు 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌లో అడుగు పెట్టినట్లు అవుతుంది. కానీ, విరాట్ ప్రస్తుత పరిస్థితి వల్ల ఇది అసాధ్యం అనిపిస్తోంది!