Rohit Sharma Retirement :టెస్టుల్లో ఘోరంగా విఫలమవుతున్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ దిశగా అడుగులు వేస్తున్నాడు. జనవరి 3 నుంచి ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరగనున్న చివరి టెస్టే రోహిత్ కెరీర్‌లో చివరి టెస్టు కానుందని తెలుస్తోంది. ఈ మేరకు రోహిత్ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రోహిత్‌తో పాటు కోహ్లీ కూడా టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలనే ఒత్తిడి పెరుగుతోంది.
గత కొన్నాళ్లుగా టెస్టుల్లో పేలవమైన ఫామ్‌తో సతమతమౌతున్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో తీవ్రంగా నిరాశపర్చిన రోహిత్ శర్మ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు.
బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విఫలమవుతున్న రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ మేరకు మెల్‌బోర్న్ టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగే ఐదో టెస్టు తర్వాత టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పాలని రోహిత్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ విషయం తెలుసుకున్న బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లు రోహిత్‌తో మాట్లాడారని కానీ, రోహిత్ తన మనసు మార్చుకునే అవకాశం లేదని సమాచారం. ఒకవేళ అదృష్టం కలిసొచ్చి టీమ్‌ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరితే ఆ మ్యాచ్ వరకు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సెలక్టర్లు రోహిత్‌ను ఒప్పించే అవకాశం ఉంది. భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించకపోతే సిడ్నీలో కంగారులతో జరిగే ఐదో టెస్టు రోహిత్‌కు కెరీర్‌లో చివరి టెస్టు కానుంది.
సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టు కోసం పరుగులు సాధించలేకపోతున్నారని సునీల్ గావస్కర్ వంటి మాజీ క్రికెటర్లు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. కెప్టెన్సీలో సైతం రోహిత్ తీసుకున్న నిర్ణయాలు జట్టుకు ప్రతికూలంగా మారుతున్నాయి. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ తొలిటెస్టులో బుమ్రా నేతృత్వంలో విజయం సాధించిన టీమ్ఇండియా, రోహిత్ నాయకత్వ బాధ్యతలు చేపట్టగానే తిరోగమనంలో పయనిస్తోంది. సిరీస్‌లో 1-2తో వెనకబడింది. ఆస్ట్రేలియాతో ఆడిన మూడు టెస్టుల్లో 6 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 31 పరుగులే చేశాడు. అదే సమయంలో బుమ్రా ఈ సిరీస్‌లో 30 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉండటం గమనార్హం.
మెల్‌బోర్న్ టెస్టులో ఓడి టీమ్ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ఫైనల్‌కు చేరాలంటే ఎంతో అదృష్టం కలిసి రావాలి. టీమ్‌ఇండియా ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఉండాలంటే ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగే చివరి టెస్టులో తప్పక గెలవాలి. ఓడినా లేదా డ్రా చేసుకున్నా భారత్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. సిడ్నీ టెస్టులో గెలిచినా భారత్ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. జనవరి ఆఖరిలో ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంటేనే భారత్ ఫైనల్‌కు చేరుతుంది.
ఒక వేళ భారత్, ఆసీస్ మధ్య చివరి టెస్టు డ్రాగా ముగిసి శ్రీలంక 2-0తో కంగారులపై గెలిస్తే లంకేయులు తుది పోరుకు అర్హత సాధిస్తారు. భారత్‌తో ఒక టెస్టు, శ్రీలంకతో రెండు టెస్టులు ఆడాల్సి ఉన్న ఆస్ట్రేలియా ఈ మూడింటిలో ఒక్కటి గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది.ఇప్పటికే దక్షిణాఫ్రియా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంది. జనవరి 3 నుంచి ఆసీస్, భారత్ మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది.
రోహిత్, విరాట్ మళ్లీ ఫెయిల్- రిటైర్మెంట్‌పై రవిశాస్త్రి కామెంట్స్
ఆసీస్ బ్యాటర్‌పై రోహిత్ ఫైర్- చెబితే వినాలిగా మరి!