Paris Olympics 2024 Manu Bhkaer Grand Welcome : పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించడంతో భారత షూటర్ మను బాకర్ పేరు మార్మోగిపోతుంది. ప్రతిఒక్కరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె తన పతకాలతో స్వదేశంలో అడుగుపెట్టింది.
దీంతో ఆమెతో పాటు ఆయన కోచ్ జస్పల్ రానాకు దిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర ఘన స్వాగతం లభించింది. చాలా మంది ఆమెను చూసేందుకు, ప్రశంసించేందుకు తరలివచ్చారు. బాణాసంచా మోతలు, డప్పు శబ్దాలతో హోరెత్తిస్తూ పూల వర్షం కురిపించారు. అందరూ మను బాకర్ ఫొటోలు ఉన్న ఫ్లకార్డులు పట్టుకుని సందడి చేశారు. డప్పు శబ్దాలకు కేరింతలు కొడుతూ చిందులు వేశారు. ఆమె మెడలో పూల దండలు వేసి సత్కరించారు. అలానే సెల్‌ఫోన్లలోనూ మను బాకర్‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. పోలీసులు వారిని కంట్రోల్ చేస్తూ తమ విధులను కొనసాగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
స్వదేశానికి తిరిగొచ్చిన తన కూతురిని దగ్గరికి తీసుకుని ప్రశంసించేందుకు దిల్లీ విమానాశ్రయానికి వచ్చారు మను బాకర్ తండ్రి. "నేను ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నాను" అంటూ దిల్లీ ఎయిర్ పోర్ట్ దగ్గర తన కూతురికి దక్కిన ఘనస్వాగతంపై హర్షం వ్యక్తం చేశారు.
కాగా, మను బాకర్ రెండు మెడల్స్ సాధించడంతో ఆమెకు మరో అరుదైన గౌరవం కూడా లభించింది. ఆగస్టు 11న ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో ఆమె మహిళా పతాకధారిగా వ్యవహరించనుంది. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇకపోతే ఇప్పటి వరకు భారత్ మూడు కాంస్యాలను మాత్రమే సాధించింది. ఇందులో రెండు బాకర్‌వే కావడం విశేషం. మరో షూటర్ సరబ్‌జోత్ సింగ్ కాంస్యం గెలిచాడు. మను బాకర్ అయితే ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన మను బాకర్ అరుదైన ఘనతను దక్కించుకుంది. 1900 ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ రెండు రజతాలను ముద్దాడారు. ఇప్పుడు నార్మన్ తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలను సాధించిన అథ్లెట్‌గా బాకర్ నిలిచింది. మహిళల 10మీ మహిళల ఎయిర్ పిస్టల్‌లో, సరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్యాలు గెలుచుకుంది. అయితే 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మాత్రం నాలుగో స్థానంలో నిలిచి తృటిలో మరో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. లేదంటే మూడు పతకాలు సాధించిన ఏకైక భారత్ క్రీడాకారిణిగా అవతరించేది.
మనుబాకర్లో స్ఫూర్తి నింపిన ఆ టాటూ - దీని గురించి మీకు తెలుసా? - Paris Olympics 2024 Manu Bhaker
'అలా జరగడం నచ్చలేదు - ఒత్తిడికి గురయ్యాను!' - మూడో పతకం మిస్ అవ్వడంపై మను బాకర్ - Paris Olympics 2024