Paris Olympics 2024 Arshad Nadeem : పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ అందుకుని సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేశాడు పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్(Arshad Nadeem Gold Medal). ఫైనల్లో ఏకంగా 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి ఏకంగా పసిడిని ముద్దాడాడు. దీంతో దేశ వ్యాప్తంగా అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే సమయంలో అతడి ఆర్థిక పరిస్థితి గురించి కూడా వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.
దీంతో నదీమ్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుంటున్న ప్రజలు అతడికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. నదీమ్ ఇంటికి భారీ సంఖ్యంలో అభిమానులు చేరుకొని అతడికి డబ్బులు అందజేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలో పలువురు వ్యక్తులు నదీమ్‌కు నగదు సాయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి మాట్లాడుతూ నదీమ్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాడని అన్నాడు. అందుకే తాను నదీమ్‌కు సాయం చేసినట్లే ప్రభుత్వం కూడా సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. అక్కడి ప్రభుత్వం ప్రతిసారి వాగ్దానాలు చేస్తుందే కానీ ఆర్థిక సాయం చేయట్లేదని ఆరోపించాడు.