తెలంగాణ

telangana

ETV Bharat / sports

184 దేశాలు, 10వేల అథ్లెట్లు, 329 పతకాలు- పారిస్ ఒలింపిక్స్ ఫుల్ డీటెయిల్స్ - PARIS OLYMPICS 2024

Paris Olympics 2024: పారిస్​లో జరగనున్న విశ్వ క్రీడల సంబరానికి సర్వం సిద్ధమవుతోంది. కోవిడ్ తర్వాత తొలిసారి ప్రేక్షకుల మధ్య జరగనున్న ఈ ఒలింపిక్స్‌ కోసం ప్రపంచ క్రీడాభిమానులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఒలింపిక్స్​ గురించి పూర్తి సమాచారం ఈ స్టోరీలో తెలుసుకోండి.

Paris Olympics 2024
Paris Olympics 2024 (Source: Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 1:39 PM IST

Paris Olympics 2024:క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విశ్వ క్రీడల ఆరంభానికి సమయం సమీపిస్తోంది. పారిస్ ఒలింపిక్స్‌ 2024 ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. పోడియంపై తమ దేశ క్రీడాకారులను చూసేందుకు ఆయా దేశాల క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒలింపిక్స్‌ సమీపిస్తున్నా కొద్దీ ప్రపంచం మొత్తాన్ని క్రీడా మేనియా చుట్టేస్తోంది. ప్రపంచం దృష్టిని ఆకర్షించే ఆ అత్యుత్తమ అథ్లెట్‌ ఎవరు? నీరజ్‌ చోప్రా భారత్‌కు మరో స్వర్ణాన్ని అందిస్తాడా? అని క్రీడా ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020 టోక్యో ఒలింపిక్స్‌ను ప్రేక్షకులు లేకుండా నిర్వహించారు. అయితే ఈసారి వేలాదిమంది అభిమానుల మధ్య ఈ విశ్వ క్రీడలను నిర్వహిస్తున్నారు. విశ్వ క్రీడలు సమీపిస్తున్న వేళ అయితే పారిస్‌ ఒలింపిక్స్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం.

  • పారిస్ 2024 ఒలింపిక్స్ జూలై 26 న ప్రారంభమై ఆగస్టు 11న ముగుస్తాయి.
  • 32 క్రీడలకుగాను 45 విభాగాల్లో 329 ఈవెంట్‌లు నిర్వహించనున్నారు.
  • 184 దేశాల నుంచి 10,000 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.
  • ఈసారి ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్‌ను మొదటిసారిగా ప్రవేశపెట్టారు.
  • పారిస్ 2024 జూలై 26 శుక్రవారం ఆరంభ వేడుకలతో ఘనంగా ప్రారంభం అవుతుంది.
  • ప్రారంభ వేడుకలు పాంట్ డి ఆస్టర్‌లిట్జ్, పాంట్ డి ఐనాల్లో జరుగుతాయి.
  • ఒలింపిక్స్‌ చరిత్రలో మొదటిసారిగా ప్రారంభ వేడుకలో స్టేడియంలో నిర్వహించట్లేదు.
  • జూలై 26న ఒలింపిక్స్‌ అధికారికంగా ఆరంభం కానుండగా, అంతకు రెండు రోజుల ముందే అంటే జూలై 24 నుంచి సాకర్, రగ్బీ సెవెన్స్, ఆర్చరీ, హ్యాండ్‌బాల్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి.
  • మొత్తం 329 బంగారు పతకాల కోసం అథ్లెట్లు పోటీపడనున్నారు.
  • స్కేట్‌బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్‌ రెండోసారి కూడా ఒలింపిక్స్‌లో భాగం అయ్యాయి.
  • భారత్ 15 విభాగాల్లో పాల్గొంటుండగా, దాదాపు 100 మంది అథ్లెట్లు పతకాల కోసం పోటీపడనున్నారు.

క్రీడల జాబితా

  • ఆక్వాటిక్స్
  • ఆర్చరీ
  • అథ్లెటిక్స్
  • బ్యాడ్మింటన్
  • బాస్కెట్‌బాల్
  • బాక్సింగ్
  • కానోయింగ్
  • సైక్లింగ్
  • ఈక్వెస్ట్రియన్
  • ఫెన్సింగ్
  • హాకీ
  • ఫుట్‌బాల్
  • గోల్ఫ్
  • జిమ్నాస్టిక్స్
  • హ్యాండ్‌బాల్
  • జూడో
  • పెంటాథ్లాన్
  • రగ్బీ సెవెన్స్
  • సెయిలింగ్
  • షూటింగ్
  • స్కేట్‌బోర్డింగ్
  • స్పోర్ట్ క్లైంబింగ్
  • సర్ఫింగ్
  • టేబుల్ టెన్నిస్
  • టైక్వాండో
  • టెన్నిస్
  • ట్రయాథ్లాన్
  • వాలీబాల్
  • వెయిట్ లిఫ్టింగ్
  • రెజ్లింగ్

పాల్గొనే దేశాలు
పారిస్ ఒలింపిక్స్‌లో 184 దేశాలు పాల్గొంటున్నాయి. సుమారు 10,500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. అమెరికా అత్యధికంగా 588 మంది అథ్లెట్లను పంపుతోంది. ఈ 184 దేశాల నుంచే కాకుండా రష్యా, బెలారస్ నుంచి 45 మంది అథ్లెట్లు పాల్గొంటారు. ఈ రెండు దేశాలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సస్పెండ్‌ చేయడంతో వారు తటస్థ అథ్లెట్లుగా పోటీ పడతారు.

ఒలింపిక్ వేదికలు ఎక్కడ ?
పారిస్ ఒలింపిక్స్‌కు మొత్తం 35 వేదికలను ఉపయోగించనున్నారు. ఇవన్నీ చాలా వరకు పారిస్‌ పరిసరాల్లోనే ఉన్నాయి. లిల్లే, వైరెస్-సుర్-మార్నే, మార్సెయిల్, లియోన్, బోర్డియక్స్, సెయింట్-ఎటియెన్, నైస్, నాంటెస్, చాటేరోక్స్ ప్రాంతాల్లోనూ ఒలింపిక్‌ పోటీలు జరగనున్నాయి. సర్ఫింగ్ ఈవెంట్‌ను పారిస్‌కు దాదాపు 10,000 మైళ్ల దూరంలో ఉన్న ఫ్రెంచ్ పాలినేషియాలోని తాహితీలో నిర్వహిస్తారు.

ఒలింపిక్స్​లో కొత్త క్రీడలకు భారత్ ప్రపోజల్!- లిస్ట్​లో కబడ్డీ, ఖోఖో - 2036 Olympic Games

ఒలింపిక్స్​లో తొలిసారిగా గోల్డ్​ మెడల్ విన్నర్​కు 50,000 డాలర్లు - Olympics Gold Medal

ABOUT THE AUTHOR

...view details