Omelette Chanadal Curry in Telugu : ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకపోతే కోడిగుడ్డుతో ఏదో ఒక కూర చేసుకోవడం మామూలే. అలాగే, ఎగ్స్‌తో చేసే వంటకాలను పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటుంటారు. అలాగని ఎప్పుడూ ఒకే రుచిలో కర్రీలను ప్రిపేర్ చేసినా బోరింగ్ ఫీల్ వచ్చేస్తుంది. అందుకే, మీకోసం ఒక అద్దిరిపోయే రెసిపీ తీసుకొచ్చాం. అదే, "శనగపప్పు ఆమ్లెట్ కూర". చికెన్, మటన్ కంటే సరికొత్త రుచితో నోరూరిస్తోంది ఈ కర్రీ. బ్యాచిలర్స్ కూడా ఈ రెసిపీని చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది! మరి, ఈ సూపర్ టేస్టీ కర్రీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
కర్రీ కోసం :
- శనగపప్పు - 1 కప్పు
- వాటర్ - 3 కప్పులు
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- దాల్చిన చెక్క - అంగుళం ముక్క
- బిర్యానీ ఆకు - 1
- లవంగాలు - 3
- యాలకులు - 2
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఉల్లిపాయ తరుగు - అర కప్పు
- టమాటా ముక్కలు - పావు కప్పు
- పచ్చిమిర్చి - 3
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావుటీస్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - అరటీస్పూన్
- ధనియాల పొడి - అరటీస్పూన్
- కారం - 1 టీస్పూన్
- మిరియాల పొడి - అరటీస్పూన్
- కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- గరం మసాలా - అరటీస్పూన్
ఆమ్లెట్ కోసం :
- గుడ్లు - 4
- మిరియాల పొడి - అరటీస్పూన్
- ఉప్పు - తగినంత
- పసుపు - పావుటీస్పూన్
- టమాటా తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- సన్నని పచ్చిమిర్చి తరుగు - కొద్దిగా
- నూనె - తగినంత
గుడ్డు లేకుండా అద్దిరిపోయే "బ్రెడ్ ఆమ్లెట్" - ఇలా ప్రిపేర్ చేస్తే ఇంకా కావాలంటారు!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా శనగపప్పుని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
- అవి వేగాక సన్నని ఉల్లిపాయ తరుగు వేసి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆవిధంగా వేయించుకున్నాక అందులో పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
- టమాటా ముక్కలు మంచిగా ఉడికి వాటిపై స్కిన్ సెపరేట్ అవుతున్నప్పుడు ఉప్పు, పసుపు, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, మిరియాల పొడి వేసి నూనె పైకి తేలేదాక మసాలాలను చక్కగా వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక అందులో గంటపాటు నానబెట్టిన శనగపప్పుని వాటర్ వడకట్టి వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత మూడు కప్పుల వరకు వాటర్, కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని కలిపి మూతపెట్టి హై ఫ్లేమ్ మీద 1 విజిల్, మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
ఓసారి ఇలా "ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్" ట్రై చేయండి - ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారంతే!
- పప్పు ఉడికేలోపు ఆమ్లెట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక గిన్నెలో ఎగ్స్‌ని పగులకొట్టి పోసుకోవాలి. ఆపై అందులో మిరియాల పొడి, పసుపు, ఉప్పు వేసి మొత్తం కలిసేలా బాగా బీట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో సన్నని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి తరుగు వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆమ్లెట్ ప్లఫ్పీగా వస్తుంది.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆపై దానిలో కాస్త మందంగానే ఎగ్ మిక్చర్ పోసుకొని ఆమ్లెట్‌ని 90% వరకు కాలనిచ్చి మధ్యకి మడిచి ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలా మొత్తం ఎగ్ మిక్చర్‌తో ఆమ్లెట్స్ వేసుకోవాలి.
- ఆ తర్వాత కాల్చుకున్న ఆమ్లెట్స్ని ఐదారు ముక్కలు పెద్దవిగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు కుక్కర్లోని స్టీమ్ మొత్తం పోయాక శనగపప్పు మెత్తగా ఉడికి మిశ్రమంలో కాస్త వాటర్ ఉండాలి. అదే పప్పు దగ్గరగా ఉడికి ఉంటే మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని శనగపప్పుని హై ఫ్లేమ్ మీద మరికాసేపు మరగనివ్వాలి.
- అనంతరం మరుగుతున్న పప్పులో 1 చిన్న టమాటా సన్నని తరుగు, కాస్త గరంమసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు, కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలు వేసి ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి.
- ఆపై మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికించుకొని దింపేసుకుంటే చాలు. అంటే కర్రీ మరీ దగ్గరకి అవ్వకుండా కాస్త గ్రేవీ ఉండేలా చూసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "శనగపప్పు ఆమ్లెట్ కర్రీ" రెడీ!
దాబా స్టైల్ "తందూరీ ఎగ్ కర్రీ"- అన్నం, చపాతీల్లోకి సూపర్ కాంబో - ఇలా ప్రిపేర్ చేయండి!