Manu Bhaker Marriage : పారిస్ ఒలింపిక్స్ 2024 రెండు పతకాలు గెలిచిన స్టార్ షూటర్ మను బాకర్ దేశం గర్వించేలా చేసింది. అలానే ఆమె ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. దీంతో ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా ఆమె పేరే వినిపిస్తోంది. ఆమె వెళ్లినా ప్రతిచోటా ఘన స్వాగతం దక్కడం, సన్మానాలు జరగడం అవుతున్నాయి. ఇదే సమయంలో మను బాకర్ పెళ్లిపై కూడా చాలా మందిలో ఆసక్తిగా నెలకొంది. ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది? ఎవరిని చేసుకుంటుంది? అని చాలా మందిలో ఉత్సుకత నెలకొంది.
అయితే తాజాగా మను బాకర్ తన స్వస్థలం ఝజ్జర్(హరియాణా)కు వెళ్లింది. అక్కడ ఆమెకు ఘన స్వాగతం లభించింది. అక్కడి అధికారులు మనుకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అక్కడ ఆమె తన కుటుంబంతో కలిసి స్థానికంగా ఉన్న గోశాలలో పూజలు నిర్వహించింది.
ఈ సందర్భంగా అక్కడ మను బాకర్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అప్పుడు ఆమెకు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. 'ఎప్పుడు చేసుకుంటార'ని అడగగా, మను బాకర్ నవ్వుతూ సిగ్గు పడింది. అదే సమయంలో మను బాకర్ తల్లి సుమేధా బాకర్ మాట్లాడుతూ మనుకు ఇంకా పెళ్లి వయసు రాలేదని, చిన్న పిల్లేనని చెప్పారు. మను చేయాల్సింది ఇంకా చాలా ఉందని పేర్కొన్నారు.
అనంతరం మను బాకర్ మాట్లాడుతూ ప్రస్తుతానికి పెళ్లి గురించి ఆలోచన లేదని, భవిష్యత్లో దేవుడు ఏం రాసి పెట్టాడో చూడాలి అని చెప్పింది. ప్రస్తుతం దేశం కోసం స్వర్ణం సాధించడమే తన లక్ష్యమని, దానిపైనే తాను దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చింది.