IND vs NZ 2nd Test 2024:పుణె వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 259 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ డేవాన్ కాన్వే (76 పరుగులు; 141 బంతుల్లో 11x4), రచిన్ రవీంద్ర (65 పరుగులు; 105 బంతుల్లో 5x4, 1x6) హాఫ్ సెంచరీలు సాధించారు. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కివీస్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో అదరగొట్టాడు. మరోవైపు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు దక్కించుకున్నాడు.
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 7వ ఓవర్లోనే ఓపెనర్ టామ్ లేథమ్ (15 పరుగులు) పెవిలియన్ చేరాడు. అశ్విన్ అతడిని ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. అయినప్పటికీ కివీస్ త్వరగా పుంజుకుంది. మరో ఓపెనర్ కాన్వే, యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్రతో మంచి పార్ట్నర్షిప్ కొనసాగించాడు. దీంతో న్యూజిలాండ్ 196-3తో పటిష్ఠ స్థితిలోనే నిలిచింది.
ఇక మరోసారి కివీస్ భారీ స్కోర్ సాధించే దిశగా వెళ్తున్న సమయంలో సుందర్ మ్యాజిక్ చేశాడు. 65 వ్యక్తిగత పరుగుల వద్ద రచిన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. అలాగే కొద్ది సేపటికే వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (3 పరుగులు)ను కూడా సుందర్ పెవిలియన్ చేర్చాడు. దీంతో కివీస్ 201-5కు చేరింది. ఇక స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై సుందర్ ఆ తర్వాత కూడా అదిరే ప్రదర్శనతో టపటపా వికెట్లు కూల్చాడు. సుందర్ దెబ్బకు కివీస్ 62 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయింది. కాగా, ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు స్పిన్నర్లకే (సుందర్ 7, అశ్విన్ 3) దక్కడం విశేషం.