Neeraj Chopra Paris Olympics:పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ మిస్ అవ్వడంపై భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి విచారం వ్యక్తపరిచాడు. తాజాగా ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు తెలిపాడు. 'అందరికీ సారీ. ఒలింపిక్ పోడియంపై టోక్యో మాదిరి పారిస్‌లో మన జాతీయ గీతం ఈసారి ప్లే అవ్వలేదు. పారిస్‌లో నేను ఆశించిన పతకం సాధించలేకపోయా ' అని నీరజ్ తాజాగా వ్యాఖ్యానించాడు.
అయితే ఒలింపిక్స్‌లో ఏ ఈవెంట్లో అయినా గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెట్ల జాతీయ గీయం ప్లే అవుతుంది. రజతం, కాంస్యం నెగ్గిన అథ్లెట్లకు ఫ్లాగ్ రైజింగ్ మాత్రమే ఉంటుంది. వాళ్ల జాతీయ గీతం పోడియంపై ప్లే చేయరు. ఇక నీరజ్‌కు నెటిజన్లు సోషల్ మీడియాలో మద్దతుగా నిలుస్తున్నారు. నీరజ్ క్షమాపణలు చెప్పే అవసరం లేదని పేర్కొన్నారు. 'నీరజ్ నువ్వు మా ఛాంపియన్', 'ఈసారి పోయినా నెక్ట్స్ పక్కా గోల్డ్ సాధిస్తావ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
గత ఒలింపిక్స్‌లో అంచనాలు లేకుండా బరిలో దిగిన నీరజ్ స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించాడు. దీంతో ఈసారి జావెలిన్‌లో నీరజ్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పక్కా పసిడి సాధిస్తాడన్న దీమా ఉండింది. కానీ, గురువారం జరిగిన ఫైనల్లో అనూహ్యంగా పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ స్వర్ణం ఎగరేసుకుపోయాడు. ఈ పోటీలో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ, నీరజ్ సాధించిన వెండి పతకమూ భారత్‌కు బంగారమే!