OYO New Check In Rules : పెళ్లికాని జంటలకు దిగ్గజ ట్రావెల్ బుకింగ్ సంస్థ ఓయో షాక్ ఇచ్చింది!. చెక్-ఇన్ పాలసీలో కీలక మార్పులు చేసింది. ఇకపై పెళ్లి కాని యువతీయువకులను ఓయో హోటల్స్‌లో చెక్ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్‌షిప్‌నకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఫ్రూఫ్ అడగనుంది. ఇలాంటి ఫ్రూఫ్ లేకపోతే- స్థానిక సామాజిక సెన్సిబిలిటీకి అనుగుణంగా, బుకింగ్స్‌ను తిరస్కరించే అధికారాన్ని పార్టనర్ హోటళ్లకు ఓయో ఇచ్చింది.
ఈ కొత్త రూల్స్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ నుంచి అమలు చేయాలని ఓయో నిర్ణయించింది. అందులో భాగంగా తాజాగా రూల్స్ అమలు చేయాల్సిందిగా పార్టనర్ సంస్థలను ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల మేరఠ్‌లో వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఇతర నగరాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించింది. పౌర సమాజం నుంచి తమ సంస్థకు వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా పెళ్లి కాని జంటలకు బుకింగ్స్ సేవలను నిలిపేయాలన్న నిర్ణయం తీసుకున్నామని ఓయో పేర్కొంది.
అదే మా బాధ్యత : ఓయో
సురక్షిత, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను నిలబెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు ఓయో వివరించింది. వ్యక్తిగత స్వేచ్ఛ గౌరవిస్తున్నప్పటికీ, పౌర సమాజ సమూహాల వినతులను కూడా వినాల్సిన అవసరం ఉందని, పౌర సమాజంతో కలిసి పనిచేయడం తమ బాధ్యత అని ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ తెలిపారు. అయితే ఇదే శాశ్వత విధానం కాదని, కాలానుగుణంగా చెక్ ఇన్ పాలసీని మార్చివేసే అవకాశం ఉంటుందని చెప్పారు. కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపారులు, ఒంటరి ప్రయాణికులకు సురక్షితమైన అనుభవాన్ని కలిగించేలా తమకు తాము చూపించుకునే చొరవలో ఇదీ ఒకటని ఓయో వెల్లడించింది.
'ఓయో లక్ష్యం అదే!'
ఇదిలా ఉండగా, అతిథులు ఎక్కువ సమయం హోటల్లో ఉండేలా ప్రోత్సహించడం, రిపీట్ బుకింగ్‌లు, కస్టమర్లకు కంపెనీపై నమ్మకం పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది ఓయో. అంతేకాకుండా పోలీసులు, హోటల్ భాగస్వాములతో సురక్షితమైన ఆతిథ్యంపై జాయింట్ సెమినార్లో నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న హోటళ్లను బ్లాక్‌లిస్ట్ చేయడం, అనధికారికంగా ఓయో బ్రాండింగ్ ఉపయోగిస్తున్న హోటళ్లపై చర్యలు చేపట్టింది.