Fourth City in Hyderabad : నాలుగో నగరంలో ఏర్పాటు కానున్న ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ల నిర్మాణమంతా రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణమిత్రగా రూపొందించనుంది. రాష్ట్రంలో నిర్మాణం పూర్తి చేసుకోనున్న తొలి నెట్ జీరో సిటీ ఇదేనంటా. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, విద్యుత్, పురపాలక, భవనాలు, రహదారులు, టీజీఐఐసీ శాఖలకు బాధ్యతలు అప్పగించింది.
నాలుగో నగరానికి హైదరాబాద్ నుంచి సులభంగా చేరుకునేందుకు విమానాశ్రయం నుంచి ఓఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్ నుంచి ప్రతిపాదిత ప్రాంతాలు బేగరికంచె, మీర్‌ఖాన్‌పేట్, ముచ్చెర్ల వరకు 330 అడుగుల వెడల్పు రహదారులు, ఇతర అంతర్గత రహదారుల డిజైన్లను రూపొందించారు. రావిర్యాల ఓఆర్‌ఆర్ నుంచి మీర్‌ఖాన్‌పేట మీదుగా ముచ్చర్ల, ఆమన్‌గల్ మండలం ఆకుతోటపల్లె వద్ద ప్రాంతీయ రింగ్ రోడ్డును కలుపుతూ 40 కి.మీ. రహదారిని నిర్మిస్తారు. దీంతో పాటు రాజేంద్రనగర్‌లోని కొత్త హైకోర్టు నుంచి నాలుగో మహానగరం వరకు మెట్రో రైలు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
రాజధానికి సమీపంలో కాలుష్య రహితంగా : చుట్టూ పచ్చదనం, విశాలమైన రహదారులు, ఆహ్లాదాన్ని పంచే మేఘాలు, కనిపించే వాతావరణ, వాణిజ్య క్లస్టర్లు, ప్రణాళిక బద్ధంగా నివాస ప్రాంతాలు, బహుళ జాతి సంస్థలు ఒక చోట, వీటన్నింటికీ దూరంగా పరిశ్రమలు, ఇలా నాలుగో మహానగరం కాలుష్య రహితంగా సిద్ధం కానుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగరికంచె, మీర్‌ఖాన్ గ్రామాల్లోని 4 వేల ఎకరాల్లో నెట్ జీరో సిటీని నిర్మించనున్నారు. వచ్చే 50 ఏళ్లలో అక్కడ మారనున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలను ఇప్పటికే రూపొందించారు. వాతావరణం కలుషితం కాకుండా మార్గదర్శకాలు తయారు చేశారు. నాలుగేళ్లలో దశల వారీగా ఈ సిటీని అందుబాటులోకి తేనున్నారు.
ఎలక్ట్రానిక్స్, లైఫ్‌సైన్సెస్‌కు ప్రాధాన్యం : ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్స్, సాధారణ పరిశ్రమలకు 4,774 ఎకరాలు, లైఫ్ సైన్సెస్ హబ్ కోసం 4,207 ఎకరాలను కేటాయించారు. ఎలక్ట్రానిక్స్, సాధారణ పరిశ్రమలను స్థాపించేందుకు విదేశీ సంస్థలు ఒకవైపు నుంచి ఆసక్తి చూపిస్తున్నాయి. కొంగరకలాన్‌లో ఆపిల్ ఫోన్ విడి భాగాలను తయారు చేస్తున్న ఫాక్స్ కాన్ సంస్థ, ఎలక్ట్రానిక్స్ జోన్‌లో తన శాఖలను ప్రారంభించేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది.
లైఫ్ సైన్సెస్ జోన్‌లో ప్రాణాధార మందుల తయారీ, పరిశోధన సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థలు, విదేశీ ఫార్మా సంస్థలు వాటి విస్తరణ ప్రాజెక్టులను ఇక్కడ ఆరంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బేగరికంచె ప్రాంతంలో విశ్వ విద్యాలయ జోన్, వాణిజ్య, నివాస నిర్మాణాలను ప్రారంభించేందుకు భూములను అధికారులు ఎంపిక చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు, నివాస ప్రాంతాలు, పరిశ్రమలు ఇలా వేర్వేరు ప్రాంతాలు ఉండటంతో విద్యుత్ అధికారులు ఏ ఏ ప్రాంతాల్లో ఉప-విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న అంశంపై స్థలాలను ఇప్పటికే పరిశీలించి ఉంచారు.
డీపీఆర్ ప్రకారం : రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట్, ముచ్చర్ల, బేగరికంచె ప్రాంతాల్లో నాలుగో మహా నగరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసి, 13,972 ఎకరాల్లో నిర్మాణం కానున్న మహా నగరంలో వివిధ విభాగాలు, ఉప కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు భూములను కేటాయించింది.
ప్రణాళికలు, పచ్చదనం, వ్యర్థాల నిర్వహణ : పర్యావరణాన్ని కాపాడేందుకు నెట్ జీరో సిటీలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. వాణిజ్య పంటలు, చెట్లు ఇలా రహదారి వెంట నీడనిచ్చే వృక్షాలు ఉంటాయి. వీటి ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల కంటే, ఇక్కడ రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండనున్నాయి. ఇళ్లు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు, ఘన వ్యర్థాల నిర్వాహణకు ప్రత్యేకమైన వ్యవస్థను రూపకల్పన చేస్తున్నారు. జలాలను శుద్ధీకరించి మళ్లీ వినియోగించేందుకు వీలుగా మారుస్తూ, జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కాలుష్య రహిత వస్తువులను వినియోగించనున్నారు.