Hydra Demolitions at Madhapur : మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల అక్రమ కట్టడాన్ని హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఉదయం సుమారు 10.30 నుంచి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించిన హైడ్రా సిబ్బంది, కొద్దిసేపటి క్రితం బాహుబలి క్రేన్‌ను సైతం రంగంలోకి దించారు. సాయంత్రానికి మొత్తం భవంతిని నేలమట్టం చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
హైడ్రా కీలక నిర్ణయం - ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
అయినా మళ్లీ నిర్మాణం : అక్రమ కట్టడానికి సంబంధించి 2024లో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇవ్వటంతో పాటు కొంత భాగాన్ని సైతం కూల్చివేశారు. అయినప్పటికీ నిర్మాణదారులు వెనక్కి తగ్గకుండా మళ్లీ నిర్మాణాన్ని కొనసాగించగా, ఫిర్యాదు అందుకున్న హైడ్రా యంత్రాంగం కూల్చివేత ప్రక్రియ చేపట్టింది. శనివారం మాదాపూర్‌లోని 100 ఫీట్ రోడ్లో ఉన్న భవనాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు. అయితే భవంతి ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో మాదాపూర్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే వాహనాలకు ఇబ్బంది లేకుండా బిల్డింగ్ వెనకవైపు నుంచి తొలుత కూల్చివేతను ప్రారంభించారు. సాయంత్రానికి మొత్తం భవంతి నేలమట్టం అయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.