Bhadrachalam Temple : ప్రస్తుతకాలంలో ట్రావెలింగ్ ట్రెండింగ్‌గా మారిపోయింది. మానసికోల్లాసానికి, నూతనోత్సాహానికి పర్యాటక ప్రాంతాలను వారు చుట్టేస్తున్నారు. అలాంటి వారు ఇతిహాస సంబంధం ఉన్న ఊళ్లను చుట్టేసి, సందర్శిస్తుంటే కలిగే ఆ ఆనందమే వేరయా. ఈ కోవకు చెందిందే భద్రాచలం మహాపుణ్య క్షేత్రం. ఇక్కడ చూడడానికి ఇతిహాసంతో సంబంధం ఉన్న అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వేల ఏళ్లనాటి ఆనవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల కూడా ఇదే తరహా వైభవాన్ని చాటుతోంది. ఇక్కడ ఆధ్యాత్మికం ఉట్టి పడుతోంది.
త్రేతాయుగం నాటి శిలాసంపద : భద్రాచలంలోని దుమ్ముగూడెం పర్ణశాలలో త్రేతాయుగం నాటి శిలాసంపద ఉంది. రామాయణం ప్రకారం సీతారామ లక్ష్మణులు రెండున్నరేళ్లపాటు ఇక్కడే నివాసం ఉన్నారు. అంతేందుకు రామాయణ ఇతిహాసంలోని ముఖ్య ఘట్టాలన్నింటికీ వేదిక ఇదే కావడం విశేషం. దుమ్ముగూడెంలోని ఉన్న రాళ్లపై సీతమ్మవారు నీర చీరలను ఆరేసుకున్న చారికలు ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. అలాగే ఇదే ప్రదేశంలో సీతవాగు ప్రవహిస్తోంది. శూర్పణఖ ముక్కు, చెవులు కోసిందే ఇక్కడేనని భక్తులు విశ్వాసం ఉంచుతారు. లక్ష్మణరేఖ గీసిందీ కూడా పర్ణశాల వద్దేనని భక్తులు నమ్ముతారు.
మారీశుడు మాయలేడిగా వచ్చింది ఈ అరణ్యంలోకే.. సీతాదేవిని రావణుడు అపహరించిందీ ఈ పంచవటి వద్దనే అని తెలుసా. ఖర దూషణ అనే వారితో పాటు 40 వేల మంది రాక్షసులను రాముడు సంహరించిన ప్రాంతమే దుమ్ముగూడెంగా చెబుతారు. దుమ్ము ఎగసిపడడం వల్ల దీనికా పేరు వచ్చిందని చెబుతారు. పర్ణశాలలో రాముడు నివాసం ఉండటం వల్లే ఉష్ణ గుండాల, ఎటపాక, శబరి, శ్రీరామగిరి ప్రాంతాలు పుణ్యక్షేత్రాలుగా గుర్తింపు పొందాయి. ఇలాంటి ప్రదేశాలను భక్తపరమైన వారసత్వ సంపదగా ప్రచారం చేసి యాత్రికులను రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపాలు వెలుతున్నాయి.
విశిష్టతలు ఇవే :
- రామావతారం పూర్తయిన తర్వాత రాముడు ఇక్కడే కొలువైనట్లు క్షేత్రపురాణం చెబుతోంది.
- ధ్రువమూర్తులకు యుగాల వైభవం సొంతం.
- ఇక్కడ కొలువైన స్వామికి దాదాపు మూడున్నర శతాబ్దాల క్రితమే భక్త రామదాసు ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి శిల్ప కళా సౌందర్యం అద్భుతహాః.
- వందేళ్లకు ఒకసారి ఇలాంటి మూర్తులకు స్వర్ణకవచాలు అలంకరిస్తుంటారు.
- ఈక్రమంలో 2016లో ఐదు కిలోల బంగారు కవచాలను అమర్చారు. అలాగే మరో ఐదు కిలోల స్వర్ణ కవచం వీటికి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన సైతం ఉంది.
- పర్యాటక ప్రాంతాలు, అపురూప కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి ప్రచారం చేస్తుంటారు. ఇక్కడ అంతకుమించిన విశిష్టత కనిపిస్తుంది.
- భద్రాచలం క్షేత్ర ఆధ్యాత్మిక విశిష్టతను విశ్వవ్యాప్తం ప్రచారం కల్పించాలి.
- అలాగే ఇక్కడి ప్రత్యేకతలను యాత్రికులకు చేరవేయాలి. అటు పర్యాటకంగా ఇటు భక్తిపరంగా దర్శనీయ ప్రాంతాలివి.
- భద్రాచలం మన్యంలోని దేవాలయాల విశిష్టతపై అధికారులు దృష్టి సారించనున్నారని సమాచారం.
- రామాలయాన్ని నిర్మించిన తర్వాత కల్యాణమూర్తులను తమిళనాడులోని శ్రీరంగం నుంచి తీసుకురాగా.. అప్పటికే ఇవి మహాభక్తులైన ఆళ్వార్‌ల పూజలు అందుకున్నాయి. వెయ్యేళ్లకు పూర్వం నుంచే మహిమాన్వితమైన ఈ విగ్రహాలు ఉన్నాయని పురాణ గాథలు చెబుతున్నాయి.