USA National Cricket League : ప్రముఖ యూఎస్ నేషనల్ క్రికెట్ లీగ్(ఎన్ సీఎల్)పై ఐసీసీ తాజాగా నిషేధం విధించింది. ప్లేయింగ్ ఎలెవెన్ నిబంధనలను పాటించకపోవడం అలాగే మ్యాచ్‌లో ఒకే జట్టు తరఫున 6-7 మంది విదేశీ ఆటగాళ్లు ఆడటం వంటివాటి వల్ల నేషనల్ క్రికెట్ లీగ్‌పై బ్యాన్ విధించామని ఐసీసీ ఓ లేఖలో పేర్కొంది.
నిబంధనలు ఉల్లంఘన- లీగ్ పై వేటు
కాగా, ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ లీగ్ లోనైనా జట్టులో స్వదేశానికి చెందిన ప్లేయర్లు ఏడుగురు ఉండాలి. విదేశీయులు నలుగురు మాత్రమే జట్టులో ఉండాలి. కానీ యూఎస్ నేషనల్ క్రికెట్ లీగ్ లో అలా జరగలేదు. నిబంధనలు ఉల్లంఘించడం వల్ల యూఎస్ నేషనల్ క్రికెట్ లీగ్ పై ఐసీసీ నిషేధం విధించింది. ఐసీసీ ఛైర్మన్ గా భారత్ కు చెందిన జైషా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ చర్య చేపట్టడం గమనార్హం.
పిచ్‌లో కూడా క్వాలిటీ లేదు!
యూఎస్ నేషనల్ క్రికెట్ లీగ్ లో ప్లేయింగ్ ఎలెవన్ నిబంధనలు ఉల్లంఘనే కాకుండా, చెత్త పిచ్ ల్లో మ్యాచ్ లు నిర్వహిస్తున్నారని ఐసీసీ లేఖలో ప్రస్తావించింది. ఈ లీగ్ లో చాలా తక్కువ నాణ్యత కలిగిన డ్రాప్ ఇన్ పిచ్ లను ఉపయోగించారని తెలిపింది. అందుకే పాకిస్థాన్ వహాబ్ రియాజ్, టైమల్ మిల్స్ వంటి పేసర్లు బ్యాటర్లకు గాయాలు కాకుండా ఉండేందుకు స్పిన్ వేయాల్సి వచ్చిందని పేర్కొంది.