Goalkeeper Record Goals : ఫుట్‌బాల్ గేమ్‌లో గోల్స్ చేయడంలో అరుదైన రికార్డు నెలకొల్పిన గోల్ కీపర్ గురించి విన్నారా? ఎక్కడైనా గోల్ కీపర్ గోల్స్ ఆపుతాడు కానీ? చేస్తాడా? అంటారా? దాదాపు అలా జరగదు. కానీ బ్రెజిల్ గోల్ కీపర్ ‘రోసారియో సెని’ మాత్రం ప్రత్యేకం. ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా ఉంటూనే తన కెరీర్‌లో 100 కంటే ఎక్కువ గోల్స్ చేశాడు. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. రొసారియో సెని తన కెరీర్‌లో ఫ్రీ-కిక్‌లు, పెనాల్టీల ద్వారా 131 గోల్స్ చేశాడు. కొన్ని నివేదికలు 128 గోల్స్ అని చెబుతున్నాయి.
రొసారియో సెని సావో పాలో ఫుట్‌బాల్ క్లబ్ తరఫున రెండు దశాబ్దాలకు పైగా (1990-2015) ఆడాడు. 2015లో 42 సంవత్సరాల వయస్సులో సావో పాలో నుంచి రిటైర్ అయ్యాడు. అతడు వాస్తవానికి గోల్ కీపర్. కోర్టులో లాస్ట్ డిఫెండర్‌గా, బాల్ గోల్ వెళ్లకుండా ఆపడం అతడి బాధ్యత. అయినా అతడి కెరీర్‌లో ఫ్రీ-కిక్‌ల ద్వారా 59 గోల్స్, పెనాల్టీ కిక్‌ల ద్వారా 69 గోల్స్ చేశాడు.