India A Ball Tampering Controversy :భారత్ ఎ జట్టు రెండు అనధికార టెస్టుల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా ఎ జట్టుతో జరిగిన అనధికార తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో వివాదం జరిగింది. బంతిని మార్చాలన్న అంపైర్ నిర్ణయాన్ని టీమ్ఇండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ తప్పుబట్టాడు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ టీమ్‌ఇండియా ఆటగాళ్లను ఉద్దేశించి బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
దీంతో మైదానంలోనే ఇషాన్ కిషన్ అంపైర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంతిపై రుద్దినట్లు కనిపించడం వల్ల భారత ఆటగాళ్లపై అంపైర్ క్రెయిగ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. టీమ్ఇండియా ప్లేయర్లు- అంపైర్ల మధ్య జరిగిన ఈ వాదనలు స్టంప్స్ మైక్స్‌లో రికార్డ్ అయ్యాయి.
'చర్చలకు తావులేదు. వెళ్లి ఆడండి. ఇక్కడ చర్చింకునేందుకు కార్యక్రమం జరగడం లేదు' అని అంపైర్ భారత ఆటగాళ్లతో అన్నాడు. దీనికి ఇషాన్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. 'మేం ఇదే బంతితో ఆడాలా? మీ నిర్ణయం అత్యంత మూర్ఖత్వం' అని ఇషాన్ అన్నాడు. 'మీ కారణంగానే బంతి పాడైంది. నువ్వే (ఇషాన్‌ను ఉద్దేశించి) స్క్రాచ్ చేశావు. అందువల్లే బంతి మార్చాల్సి వచ్చింది' అని అంపైర్ వెల్లడించాడు.