Woman Solo World Tour On Bike : ఇల్లు, కన్న బిడ్డకు దూరంగా 371 రోజులు.. అతి కష్టమైన లక్ష్యం.. అడుగడుగునా సవాళ్లే.. అయినా ధైర్యం చెక్కు చెదరలేదు! ఒంటరిగా బైక్‌పై 64 దేశాలను చుట్టేసి ఔరా అనిపించింది ఓ లేడీ రైడర్. మహిళలకు దాదాపు అసాధ్యం అనుకున్న అరుదైన లక్ష్యాన్ని ఛేదించింది. ఆమెనే అసోంకు చెందిన ప్రొఫెషనల్ బైక్ రైడర్, ఫిట్నెస్ ట్రైనర్ మీనాక్షి దాస్(41). మీనాక్షి చేసిన ఈ సోలో వరల్డ్ టూర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
64 దేశాలు చూట్టేసి!
2023 డిసెంబర్ 17న మీనాక్షి దాస్ తన ప్రయాణం ప్రారంభించింది. మొదటగా నేపాల్‌కు వెళ్లి అక్కడి నుంచి మళ్లీ ముంబయికి వచ్చింది. ముంబయి నుంచి విమానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు(యూఏఈ) వెళ్లింది. అక్కడి నుంచి బైక్‌పై ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇరాన్, అర్మేనియా, జార్జియా, తుర్కియే, బల్గేరియా, మోల్డోవా, రొమేనియా, సెర్బియా, మాసిడోనియా, గ్రీస్, అల్బేనియా, క్రొయేషియా, మోంటెనెగ్రో, స్లోవేనియా, స్లోవేనియా, హంగరీ, ఆస్ట్రియా, బోస్నియా, హాట్‌సగౌనియా, చెక్ రిపబ్లిక్, ఇటలీ, మొనాకో, వాటికన్, స్విట్జర్లాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్, జర్మనీ, లక్సెంబర్గ్, లిథువేనియా, బెల్జియం, పోలాండ్, నెదర్లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్, డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే , లాట్వియా, రష్యా, చైనా, కజఖ్‌స్థాన్, లావోస్, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియా, సింగపూర్ - ఇలా మొత్తం 64 దేశాలను చూట్టేసింది. మీనాక్షి ప్రయాణం 2024 డిసెంబర్ 22న ముగిసింది.
ఎన్నో అడ్డంకులు
అయితే, మీనాక్షి ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు. ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. కొన్ని దేశాల్లో వీసా మంజూరులో అనేక సమస్యలు ఎదుర్కొంది మీనాక్షి. "కొన్ని దేశాల్లో ప్రయాణించేటప్పుడు బైక్ చాలా దెబ్బతింది. కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుపానులను ఎదుర్కొన్నాను. కొన్ని చోట్ల ప్రమాదాలకు గురయ్యాను. ఆయా దేశాల్లో నివసిస్తున్న అస్సామీలు, భారతీయులు, స్థానికులు నాకు సహాయం చేశారు. కొంతమంది వీసా ప్రాసెస్‌లో సహాయపడ్డారు. మరికొంత మంది ఆర్థికంగా సాయం చేశారు. వసతి సౌకర్యం, ఆహారం అందించారు. ఈ ఏడాది ప్రయాణంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను" అని మీనాక్షి దాస్ 'ఈటీవీ భారత్'తో చెప్పింది.
భూమి తాకట్టు పెట్టి
బైక్‌పై ప్రపంచాన్ని చుట్టిరావాలనే కోరిక ఉంటే సరిపోదు. దానికి కావాల్సిన వనరులన్నీ ఉండాలి. కానీ సంకల్పం గొప్పదైతే కావాల్సినవన్నీ సరైన సమయానికి మన దరికి చేరుతాయి. మీనాక్షి విషయంలో కూడా ఇలాగే జరిగింది. మొదట్ బైక్ చేయాలని ప్రణాళిక వేసుకున్నప్పుడు ఆర్థిక సవాళ్లు ఎదురయ్యాయి. భారత్ వెలుపల స్పాన్సర్లు దొరకలేదు. అయినా మీనాక్షి తన ప్లాన్‌ను మార్చుకోలేదు. తన లక్ష్యం కోసం భూమిని తాకట్టు పెట్టడానికి కూడా మీనాక్షి వెనుకాడలేదు.
"నా ప్రయాణానికి మొత్తం రూ.20 లక్షల వరకు ఖర్చు అయ్యింది. తెలిసినవారి సహాయ సహకారాల వల్ల నేను ఈ ప్రయాణాన్ని పూర్తి చేయగలిగాను. అయితే దీని కోసం నేను నా భూమిని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సహాయం అందలేదు. అయితే, అసోం క్రీడా శాఖ మంత్రి నందిత గార్లోసా రూ.1 లక్ష ఇచ్చారు." అని మీనాక్షి తెలిపింది.
ఈ సాహసం చేయడానికి కారణం ఏంటి?
ఈ సాహసం చేయడానికి గల కారణం ఏమిటని 'ఈటీవీ భారత్' మీనాక్షి దాస్‌ను ప్రశ్నించింది. మహిళల సాధికారతే లక్ష్యంగా ఈ ప్రయాణం ప్రారంభించినట్లు వెల్లడించింది ఆమె. "మహిళలు ఏమీ సాధించలేరని చాలా మంది అంటుంటారు. కానీ మహిళల కోసం బైక్‌పై ఒంటరిగా 64 దేశాలు ప్రయాణించి రికార్డు సృష్టించాను. విజయం సాధించాను." అని మీనాక్షి చెప్పింది. అయితే 67 దేశాలు చుట్టేయాలని మొదటి మీనాక్షి టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ కొన్ని భద్రతా కారణాల వల్ల ఒమన్, ఇరాక్, మయన్మార్‌లో ప్రవేశించడానికి ఆమెకు అనుమతి లభించలేదు.