Mistakes to Avoid while Cleaning the Laptop : ఈ 5జీ యుగంలో ల్యాప్‌టాప్ అనేది సర్వ సాధారణమైన గ్యాడ్జెట్‌గా మారిపోయింది. ఆన్లైన్ క్లాసుల పుణ్యమా అని స్టూడెంట్స్, వర్క్‌ఫ్రమ్ హోం అని ఉద్యోగస్థులు వీటితో తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే, దీనిని రోజూ వాడి పక్కన పెట్టకుండా.. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ల్యాపీ శుభ్రం చేసే క్రమంలో కొంతమంది తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల ల్యాపీ పనితీరును దెబ్బతింటుంది. మరి ల్యాప్‌టాప్‌ని ఇంట్లో క్లీన్ చేసేటప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ లిక్విడ్స్‌తో శుభ్రం చేయద్దు!
చాలామంది ల్యాపీ స్క్రీన్ క్లీన్ చేయడానికి.. కిటికీ అద్దాలు, టీవీ స్క్రీన్.. వంటివి శుభ్రం చేసే లిక్విడ్స్ వాడుతుంటారు. అయితే.. వీటిలోని కెమికల్స్ వల్ల ల్యాప్‌టాప్ స్క్రీన్ కోటింగ్ దెబ్బతింటుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి.. వీటికి బదులుగా బయట మార్కెట్లో ల్యాప్‌టాప్ కోసం స్పెషల్ క్లీనింగ్ లిక్విడ్స్ లభిస్తున్నాయి. వాటిని వాడుకోవచ్చు. అది కూడా నేరుగా స్ప్రే చేయకుండా.. మైక్రోఫైబర్ క్లాత్‌పై స్ప్రే చేసి.. దాంతో ల్యాప్‌టాప్‌ని క్లీన్ చేయాలని సూచిస్తున్నారు.
బ్రష్ ఉపయోగిస్తున్నారా?
రోజూ వాడే క్రమంలో ల్యాప్‌టాప్ కీబోర్డు సందుల్లో దుమ్ము ఎక్కువగా చేరుతుంటుంది. దీన్ని తొలగించడానికి ఎక్కువమంది టూత్‌బ్రష్, హెయిర్‌బ్రష్.. వంటి గరుకైన బ్రిజిల్స్‌తో కూడిన బ్రష్ వాడుతుంటారు. అయితే దీంతో క్లీన్ చేయడం వల్ల కీబోర్డ్ కీస్ అటూ ఇటూ కదులుతూ దెబ్బతింటాయట! పైగా వదులుగా కూడా తయారవుతాయి. కాబట్టి ఇలాంటి బ్రష్‌కి బదులుగా సాఫ్ట్‌గా ఉండే మేకప్ బ్రష్ లేదంటే సన్నటి పాయింట్ ఉన్న పెయింట్ బ్రష్ వంటివి ఉపయోగిస్తే కీబోర్డ్ డ్యామేజ్ కాకుండా దుమ్మును వదిలించచ్చు.
ఆ టవల్స్‌తో శుభ్రం చేయకండి!
చాలా మంది ల్యాపీ మొత్తాన్ని క్లీన్ చేసినా, చేయకపోయినా.. స్క్రీన్ మాత్రం రోజూ తుడుస్తుంటారు. అయితే ఈ క్రమంలో కొంతమంది పేపర్ న్యాప్‌కిన్లు, కిచెన్ టవల్స్.. వంటివి ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇవి కాస్త గరుకుగా ఉండడం వల్ల స్క్రీన్‌పై సన్నని గీతలు పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇలా జరగకూడదంటే.. ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను మైక్రోఫైబర్ క్లాత్‌తో క్లీన్ చేయాలి.
అలాగే ల్యాపీ శుభ్రం చేస్తున్న ప్రతిసారీ కరెంట్ కనెక్షన్ లేకుండా చూసుకోవాలి. ఇంకా ల్యాప్‌టాప్ వాడిన వెంటనే కాకుండా.. ఉపయోగించే ముందు, అంటే వేడెక్కక ముందు శుభ్రం చేయడం మంచిది.
ఫోన్, కంప్యూటర్‌తో ఊహించని సమస్యలు - మీకు ఏం జరుగుతుందో తెలుసా?
మీ ల్యాప్‌టాప్ కొత్తదానిలా తళతళ మెరవాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి