Alakananda Pan India Kidney Racket Update : అలకనంద కిడ్నీ మార్పిడి కేసులో తమిళనాడుకు చెందిన వైద్యుడు రాజశేఖర్‌ను చెన్నైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పవన్‌తో పాటు మిగిలిన వారి కోసం 6 బృందాలతో గాలిస్తున్నారు. హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ నిందితులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసి రూ.కోట్ల వ్యాపారం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న 9 మందిని మరోసారి విచారించేందుకు సరూర్‌నగర్ పోలీసులు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
సంచలనం రేపిన సరూర్‌నగర్ అలకనంద ఆసుపత్రి కిడ్నీరాకెట్ కేసులో దేశవ్యాప్త దందా బయటపడుతోంది. నిందితులు కేవలం హైదరాబాద్‌లోని నాలుగు ఆసుపత్రుల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు చేయిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. అనేక రాష్ట్రాల్లో దళారులు పరస్పరం సహకరించుకుంటూ కిడ్నీ మార్పిడి చికిత్సల పేరిట రూ.కోట్లలో అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు వెలుగు చూస్తోంది.
ఆరు బృందాలుగా గాలింపు : వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ సరిగా లేని చిన్న ఆసుపత్రుల్లో ఈ అక్రమ ఆపరేషన్లు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమికంగా కొన్ని నగరాలు, ఆసుపత్రుల జాబితా సేకరించిన అధికారులు, నిందితుల ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. రాచకొండ పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, జమ్మూకశ్మీర్‌లో నిందితుల కోసం గాలిస్తున్నారు. వైద్యులు, దళారులు చిక్కితే మరిన్ని ఆసుపత్రుల బాగోతం వెలుగు చూస్తుందని ఓ అధికారి తెలిపారు.
కిడ్నీ రాకెట్ కేసులో ఇప్పటి వరకు 90కి పైగా సర్జరీలు - మరో 2 ఆసుపత్రులపై పోలీసుల దృష్టి
కిడ్నీ రాకెట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న తమిళనాడుకు చెందిన వైద్యుడు రాజశేఖర్ పెరుమాల్ పోలీసులకు చిక్కాడు. ఆ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేయగా, అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయడంలో వైద్యుడు రాజశేఖర్ రెండేళ్లుగా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తోంది.
ఇంకా ఆ విషయంపై రాని స్పష్టత : 2023లో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో అక్రమ కిడ్నీ మార్పిడి కేసు సంచలనం రేపింది. అప్పట్లో విశాఖ, చెన్నై, హైదరాబాద్‌లో ఆపరేషన్లు చేసిన డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అలకనంద ఆసుపత్రి కేసులోనూ రాజశేఖర్ పెరుమాళ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు కేసుల్లో రాజశేఖర్ పెరుమాళ్ ఒక్కడేనా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
అక్రమ కిడ్నీ మార్పిడిలో కిడ్నీ దాతలు, గ్రహీతలు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, ఆపరేషన్ జరిగే ఆసుపత్రి ఇలా అన్నింటిని నిర్ణయించేది ఏపీలోని విశాఖకు చెందిన పవన్ అని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. విశాఖలో నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపు నిందితుడు పరారైనట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుడు విదేశాలకు పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2023 విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో పవన్ అనే నిందితుడిని అరెస్టు చేశారు.
వివరాలు తెలియనివ్వకుండా జాగ్రత్త పడి : రాజశేఖర్, పవన్ ఇద్దరూ జైలు నుంచి బయటకొచ్చాక హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా కొనసాగిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. వారిద్దరి నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న పవన్, మిగిలిన వారిని వారి వారి పాత్రల వరకే పరిమితం చేశాడు. సర్జరీలు చేసే డాక్టర్‌కు ఎవరికి సర్జరీ చేస్తున్నాడు, అప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రమే తెలిసేలా పవన్ వ్యవహరించాడు. సిబ్బంది, రిసెప్షనిస్ట్, డాక్టర్లు, మధ్యవర్తులు ఇలా అందరూ వారి వారి పనుల వరకే పరిమితమయ్యారే తప్ప అంతకు మించి పూర్తి వ్యవహారం గురించి మొత్తం వివరాలు తెలియనీయకుండా పవన్ జాగ్రత్తపడ్డాడు. అతను దొరికితే అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న ఇద్దరు వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని లోతుగా విచారించేందుకు కస్టడీకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. నిందితుల కస్టడీ కోసం సరూర్‌నగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీఐడీ చేతికి అలకనంద కిడ్నీ రాకెట్ కేసు - ఆసుపత్రి ఛైర్మన్ సహా ఇద్దరి అరెస్ట్
మిస్టరీగా అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ - కేసు సీఐడీకి బదిలీ?