Saif Ali Khan Stabbing Case : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసుపై ముంబయి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా బంగాల్‌కు చెందిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విషయంపై గతంలో అరెస్ట్ చేసిన నిందితుడు ఉపయోగించిన సిమ్ కార్డు ఈ మహిళ పేరుపై ఉందని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో బంగాల్లోని నదియా జిల్లాలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
'నదియా జిల్లా చప్రాకు చెందిన మహిళకు సైఫ్‌పై దాడి చేసిన నిందితుడితో పరిచయం ఉంది. నిందితుడు బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. అప్పటినుంచి ఈ మహిళతో టచ్‌లో ఉన్నాడు' అని బంగాల్ పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ముంబయి నుంచి వచ్చిన పోలీసులు ఈమెను అరెస్టు చేశారని చెప్పారు.
మరోవైపు విచారణలో భాగంగా నటుడి ఇంటిని పరిశీలించిన మహారాష్ట్ర సీఐడీ విభాగంలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం అక్కడ ఉన్న దాదాపు 19 వేలిముద్రలను సేకరించింది. వాటిల్లో ఏవీ నిందితుడి ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం వెల్లడించినట్లు తెలుస్తోంది. తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రల నమూనాల్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.ఇలా ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే మహిళను అరెస్టు చేశారు.
జనవరి 16న ఘటన
దొంగతనం చేసేందుకు జనవరి 16న తెల్లవారుజామున సైఫ్ అలీఖాన్ నివాసంలోకి బంగ్లాదేశీయుడు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ చొరబడ్డాడు. తనను పట్టుకోబోయిన సైఫ్‌పై అతడు కత్తితో ఆరు పోట్లు పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అపార్ట్‌మెంట్ నుంచి దుండగుడు పారిపోవడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు జనవరి 19న నిందితుడిని అరెస్టు చేశారు.
ఇక నిందితుడి దాడిలో సైఫ్ అలీఖాన్ వెన్నెముక, చెయ్యి సహా పలుచోట్ల గాయాలయ్యాయి. ఐదు రోజులపాటు ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయనకు కత్తి గాట్లు పడిన చోట శస్త్రచికిత్స కూడా చేశారు. ఒకటి రెండుచోట్ల ప్లాస్టిక్ సర్జరీ సైతం నిర్వహించారు. ఈనెల 21న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నారు.