Virat Kohli Fined : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఐసీసీ షాకిచ్చింది. అతడికి 20 శాతం ఫైన్ విధించింది. బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆటలో ఆసీస్ బ్యాటర్ కాన్‌స్టాస్- విరాట్ కోహ్లీ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో విరాట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి. దీంతో ఈ విషయాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారంలో విరాట్, నిబంధన లెవల్ 1ను ఉల్లంఘించినట్లు భావించిన ఐసీసీ అతడికి మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించింది.
ఇదీ జరిగింది
మ్యాచ్‌లో బుమ్రా వేసిన 11వ ఓవర్‌లో ఈ వాగ్వాదం జరిగింది. ఆ ఓవర్‌లో మూడు బంతులు ముగిసిన తర్వాత, బాల్ కోహ్లీ వద్దకు వెళ్లింది. అయితే దానిని తీసుకుని విరాట్ నాన్‌స్ట్రైకర్ వైపు వస్తున్న సమయంలో కాన్‌స్టాస్ స్ట్రైకింగ్ క్రీజ్ వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరు ఎదురుపడ్డారు. ఒకరి భుజం మరొకరి తాకింది. దీంతో కాన్‌స్టాస్ ఏదో వ్యాఖ్యలు చేయడం వల్ల కోహ్లీ కూడా అతడికి దీటుగా స్పందించాడు. ఈ విషయంపై అక్కడ కొంతసేపు వాగ్వాదం నెలకొనగా, అక్కడే ఉన్న ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
Kohli and Konstas come together and make contact 👀#AUSvIND pic.twitter.com/adb09clEqd
— 7Cricket (@7Cricket) December 26, 2024
అవన్నీ కామన్
అయితే ఈ వివాదంపై ఆసీస్ యంగ్ బ్యాటర్ స్పందించాడు. క్రికెట్‌లో ఇలాంటివి సహజమే అని అన్నాడు. 'మేమిద్దరం కాస్త భావోద్వేగానికి గురయ్యామని అనుకుంటున్నా. విరాట్ వస్తున్నట్లు నేనూ గమనించలేదు. నా గ్లవ్స్‌ను సరిచేసుకొనే పనిలో ఉన్నా. అయితే, క్రికెట్‌లో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇదేమీ పెద్ద సమస్య కాదని భావిస్తున్నా' అని కాన్‌స్టాస్ వెల్లడించాడు. కాగా, ఈ వ్యవహారంలో విరాట్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారని ప్రచారం సాగింది. మాజీలు కూడా ఇదే భావించారు. కానీ, ఐసీసీ జరిమానాతోనే సరిపెట్టింది. ఇక 24 నెలల్లో 4 డీమెరిట్ పాయింట్లు వస్తే, ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కోహ్లీ Vs కాన్‌స్టాస్ - ఐసీసీ రిఫరీ యాక్షన్ తీసుకోవాలి : మాజీ క్రికెటర్లు
బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ శుభారంభం- భారత్‌లో మళ్లీ బుమ్రానే!