Which Breakfast is Good for Health: మనం ఉదయం పూట తీసుకునే ఆహారమే.. ఆ రోజంతటికీ కావాల్సిన ఉత్సాహాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఉదయాన్నే ఏదో ఒకటి తినేద్దాం అనుకోవద్దని వివరిస్తున్నారు. ఉదయాన్నే తప్పనిసరిగా తినాల్సిన ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయని హార్వర్డ్‌కు చెందిన పోషకాహార నిపుణుడు డేవిడ్ లుడ్విగ్ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం పూట తీసుకునే ఆహారంలో పీచు తప్పనిసరిగా ఉండాలని డేవిడ్ లుడ్విగ్ చెబుతున్నారు. ఇందుకోసం రాగులు, జొన్నలు, సజ్జలతో చేసిన బ్రెడ్‌లు, అటుకులు, ఓట్‌మీల్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా పీచు తర్వాత మాంసకృత్తులను తప్పనిసరిగా తీసుకోవాలని అంటున్నారు. ఇందుకోసం పెరుగు, ఉడకబెట్టిన గుడ్లు తినాలని సలహా ఇస్తున్నారు. ఇంకా వీటి నుంచి మాంసకృత్తులతోపాటూ అత్యవసర విటమిన్లు, ఖనిజాలు కూడా అందుతాయని వివరిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ముఖ్యంగా రాగులు, కొర్రలు, సామలు, వరిగెలు, అరికెలు, జొన్నల్లో పిండి పదార్థాలు, పీచు, మాంసకృత్తులు, కొవ్వు, కేలరీలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పిండి పదార్థం ఆలస్యంగా జీర్ణమవుతుందని.. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా కలిసి చక్కెర స్థాయులు స్థిరంగా ఉంటాయని వివరిస్తున్నారు. ఇంకా పీచు ఉండడం వల్ల ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగించి త్వరగా ఆకలి వేయదని అంటున్నారు. ఫలితంగా బరువూ అదుపులో ఉంటుందని చెబుతున్నారు. వీటిలోని ఓలిగోశాక్రైడ్లు మలబద్ధకాన్ని నివారిస్తాయని.. ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు విశృంఖల కణాల పనిబట్టి క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయని పేర్కొన్నారు.
ఇంకా మనలో చాలా మంది టిఫిన్ అనగానే ఇంట్లో చేసుకోవడం ఎందుకులే అని బయట తినేద్దాం అని అనుకుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదని డేవిడ్ లుడ్విగ్ చెబుతున్నారు. ఎందుకంటే బయట తినే ఆహారంలో ఉప్పు, నూనెల మోతాదు ఎక్కువగా ఉంటుందని.. అందుకని ఇంట్లోనే తినడం మంచిదని సలహా ఇస్తున్నారు.
వీటితో పాటు తాజా పండ్లు, సోయాపాలు, కాయగూరలతో చేసిన ఆమ్లెట్, బాదం, అక్రోట్ వంటి వాటిని ఉదయాన్నే తినొచ్చని చెబుతున్నారు. వీటితోపాటు బాదం వంటి ఎండు పప్పులని కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అతిగా నీళ్లు తాగితే ఏమవుతుంది? మరి రోజుకు ఎంత నీరు తాగాలి?
బాడీ పెయిన్స్ తీవ్రంగా ఉన్నాయా? ట్యాబ్లెట్స్ వేయకుండా కారణాలు తెలుసుకోండి!