IPL 2025 Most Expensive Player Pant : ఐపీఎల్ 2025 మెగా వేలం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆక్షన్‌లో పంత్ రూ.27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతడిని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. పంత్ కోసం లఖ్‌నవూ, బెంగళూరు తీవ్రంగా పోటీపడగా, చివరకు లఖ్‌నవూ రికార్డు ధరకు దక్కించుకుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు అత్యధిక ధర పలికిన భారత ప్లేయర్‌గా కూడా పంత్ రికార్డుకెక్కాడు.
అయితే పంత్‌ను సొంతం చేసుకోవాలని భావించిన లఖ్‌నవూ మొదట రూ.20.75 కోట్లతో అత్యధిక బిడ్ వేసింది. కానీ చివరకు రూ.27 కోట్లు చెల్లించాలి మరీ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో, మొదటే వేలం ధర దగ్గర పంత్‌ను తీసుకోకుండా ఎందుకు అత్యధికంగా డబ్బు చెల్లించారనే సందేహం కొంతమందికి కలుగుతోంది. అయితే ఇందుకు ఓ కారణం ఉంది.
2018లో ఐపీఎల్ వేలంలో మొదటి సారి రైట్ టు మ్యాచ్‌ను (ఆర్టీఎం) ప్రవేశపెట్టారు. అంటే ఈ రూల్ ప్రకారం గత సీజన్‌లో తమ జట్టులో ఉన్న ప్లేయర్‌ను వేలంలో తిరిగి దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్లేయర్ కోసం ఇతర జట్లు పోటీ పడి ఓ ధర దగ్గర ఆగితే, అంతే మొత్తం చెల్లించి ఆ ఆటగాడిని పాత జట్టు దక్కించుకునేది. అంటే దీని ప్రకారం పంత్ తిరిగి దిల్లీకి రూ.20.75 కోట్లకు వెళ్లాల్సి ఉండేది.
కానీ ఈ సారి మాత్రం ఎక్కువ ధర పాడిన టీమ్‌కు ప్రయోజనం కలిగించేలా ఓ ఛాన్స్ ఇచ్చారు నిర్వాహకులు. ఎక్కువ ధర పాడిన జట్టు, ఆర్టీఎం సమయంలో ఆ ప్లేయర్ గరిష్ఠ బిడ్‌ను నిర్ణయిస్తుంది. ఈ ధరకు ఫ్రాంఛైజీ సమ్మతిస్తే ప్లేయర్ పాత జట్టుకు తిరిగి వెళ్తాడు. లేదంటే వేలం పాడిన జట్టుతో చేరుతాడు. ఇలాగే అర్ష్‌దీప్, ఫ్రేజర్, రచిన్ రవీంద్ర కూడా గరిష్ఠ బిడ్‌కు సమ్మతించి, ఆయా ఫ్రాంఛైజీలు సొంతం చేసుకున్నాయి.