IPL 2024 GT VS SRH : ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్-గుజరాత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకముందే రద్దైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఆటను రద్దు చేస్తూ మ్యాచ్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో హైదరాబాద్ 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అలా లీగ్ దశలో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది సన్‌రైజర్స్.
వాస్తవానికి మధ్యాహ్నం నుంచే హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. ఉప్పల్‌లోనూ భారీ వర్షం పడింది. దీంతో కనీసం టాస్ కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే మధ్యలో కాసేపు వరుణుడు శాంతించడం వల్ల మ్యాచ్‌ను నిర్వహించేందుకు మైదానాన్ని గ్రౌండ్ స్టాఫ్ సిద్ధం చేశారు. 8 గంటలకు టాస్ వేయాలని భావించారు. కానీ, అంతలోనే మళ్లీ వర్షం మొదలైపోయింది. చాలాసేపు వేచి చూసినా వర్షం ఆగలేదు. దీంతో చేసేదేమిలేక మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు మ్యాచ్ నిర్వాహకులు ప్రకటించారు. ఇక సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడంతో సన్‌రైజర్స్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అలా జరిగితే రెండో స్థానానికి - సన్‌రైజర్స్ తమ చివరి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో రెండో స్థానానికి చేరే అవకాశం ఉంటుంది. కానీ ఇది జరగాలంటే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే తమ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కూడా ఓడిపోవాలి. అప్పుడు రాజస్థాన్ 16 పాయింట్లతో కిందికి దిగుతుంది. హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో పొజిషన్‌కు చేరుకుంటుంది.