IPL 2024 Lucknow Super Giants VS Punjab Kings :పంజాబ్ కింగ్స్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో లఖ్‌నవూకు ఇదే తొలి విజయం. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తమ ఓటమికి గల కారణాలను చెప్పేందుకు ప్రయత్నించాడు. తమ బ్యాటర్ లివింగ్ స్టోన్ (17 బంతుల్లో 28*) గాయమవ్వడం, మయాంక్ బౌలింగ్ తమ జట్టు పరాజయానికి కారణమైందని ధావన్ పేర్కొన్నాడు.
''లఖ్‌నవూ జట్టు మంచి ప్రదర్శన చేసింది. అయితే మా బ్యాటర్ లివింగ్‌స్టోన్ గాయపడ్డాడు. అది మమ్మల్ని తీవ్రంగా ప్రభావం చూపింది. అతడు నాలుగో స్థానంలో దిగాల్సి ఉంది. అయితేనేం మేం గొప్పగానే ఛేదన ప్రారంభించాము. కానీ మయాంక్ తన వేగవంతమైన బౌలింగ్‌తో మ్యాచ్ మలుపు తిప్పాడు. అతడిని ఎదుర్కోవడం బాగుంది. అతడి వేగాన్ని చూసి ఆశ్చర్యపోయాను. నాకూ మరోసారి అతడిని ఎదుర్కోవాలని ఉంది. అతడు యార్కర్లతో పాటు బౌన్సర్లు బాగా సంధించాడు.
పేస్‌ను ఉపయెగించుకుని షార్ట్ సైడ్ బౌండరీలు చేయాలని మా బ్యాటర్లతో చెప్పాను. కానీ మయాంక్ బెయిర్‌స్టో శరీరానికి విసిరి వికెట్ సాధించాడు. జితేశ్ శర్మతో కూడా ఇదే చెప్పాను. కానీ మోషిన్ సహా మిగిలిన బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బంతులు వేసి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ఓటమిపై మరింత విశ్లేషణ చేసుకుని తర్వాత మ్యాచ్‌లో బరిలోకి దిగుతాం. క్యాచ్‌లను చేజార్చడం వల్ల కూడా మ్యాచ్‌ను కోల్పోతున్నాం. ఆ విషయంలో మరింత మెరుగవ్వాల్సి ఉంది. విజయానికి దగ్గరగా వచ్చాం.'' అని శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.