Minister Sridhar Babu launches Mee Ticket App : ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు వెళ్లినప్పుడు బస్సు, మెట్రో రైలు ప్రయాణం చేయాలని అనుకున్నప్పుడు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. క్యూలైన్లలో నిలబడితే సమయం వృథా కావడంతో పాటు సరిపడా చిల్లర లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇలాంటి సమస్యలకు చెక్‌పెట్టేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ చర్యలు చేపట్టింది. పలు రకాల టికెట్లన్నీ ఒకే వేదికగా కొనుగోలు చేసేలా "మీ టికెట్" అప్లికేషన్‌ను రూపొందించింది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఇటీవలే ఈ యాప్‌ను ప్రారంభించారు.
మీ టికెట్ అప్లికేషన్ : రాష్ట్ర ప్రభుత్వం "మీ టికెట్" అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీ, మెట్రో టికెట్లు సహా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన టికెట్లన్నీ 'మీ టికెట్' మొబైల్ అప్లికేషన్‌లో లభిస్తాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ ఆధ్వర్యంలో ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు. పార్కులు, ఇతర పర్యాటక స్థలాల్లో క్యూలైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ప్రవేశ టికెట్లను 'మీ టికెట్' యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈనెల 9న యాప్‌ను ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ఈ సౌకర్యం తెచ్చినట్లు వెల్లడించారు. 'మీ టికెట్'లో యూపీఐ ద్వారా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండానే ఉచితంగానే టికెట్ బుక్ చేసుకోవచ్చు.
మొబైల్ యాప్‌లోనే టికెట్ల బుకింగ్ : మీ టికెట్ యాప్‌లో ఇప్పటివరకు రాష్ట్రంలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలకు చెందిన టికెట్లు కొనుగోలు చేయొచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లను బుకింగ్ చేసుకోవచ్చు. వినియోగదారులు ఎంచుకున్న లొకేషన్‌కు సమీపంలో చూడదగిన ప్రదేశాలుంటే ఆ సమాచారం సైతం యాప్‌లో కనిపించేలా అభివృద్ధి చేశారు.
క్యూఆర్ కోడ్ విధానంలో టికెట్ : దేవాలయాలు, జూ పార్కులు, మ్యూజియాలు, పార్కుల ఎదుట ఏర్పాటు చేసిన క్యూఆర్ బోర్డులను మీ టికెట్ యాప్‌తో స్కాన్ చేసి యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. వెంటనే టికెట్ క్యూఆర్ కోడ్ విధానంలో వస్తుంది. దీన్ని స్కాన్ చేసి నేరుగా లోపలికి వెళ్లే సౌలభ్యం ఉంటుంది. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థలతో ఒప్పందం చేసుకొని "మీ టికెట్'' ద్వారా చెల్లింపులు చేసేలా అందుబాటులోకి తెస్తామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ అధికారులు తెలిపారు.
అక్కమహాదేవి గుహల స్టే ప్యాకేజీ వచ్చేసింది - ధర తక్కువే - ఆన్లైన్లో ఇప్పుడే బుక్ చేసేయండి
ఈ మంచు వేళల్లో పాపికొండలు టూర్ - తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ!
హైదరాబాద్ నుంచి కొత్త పర్యాటక ప్యాకేజీలు - ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేలా ప్లాన్!