Haryana BJP Chief Rape Case : హరియాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ, గాయకుడు రాకీ మిత్తల్‌పై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. దిల్లీకి చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ గ్యాంగ్ రేప్ ఘటన 2023 జులై 3న జరిగినట్లు యువతి పేర్కొంది. తన యాజమాని, స్నేహితురాలితో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చినప్పుడు వారిద్దరు అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపింది.
"హిమాచల్‌లోని కసౌలీకి నా స్నేహితురాలితో కలిసి పర్యటకురాలిగా వెళ్లాను. ఓ హోటల్‌లో బడోలీ, మిత్తల్ కలిశారు. తాను నటిగా మారేందుకు అవకాశం ఇస్తానని, తను తీయబోయే ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని మిత్తల్ చెప్పారు. బడోలీ తను సీనియర్ రాజకీయ నాయకుడని, తనకు పెద్ద స్థాయిలో పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభపెట్టారు. అనంతరం తమకు బలవంతంగా మద్యం తాగించారు. నా స్నేహితురాలిని బెదిరించి పక్కకు తీసుకెళ్లారు. అనంతరం నాపై ఇద్దరు కలిసి అఘాయిత్యం చేశారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. నా నగ్న చిత్రాలు, వీడియోలు తీసుకున్నారు" అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే నిందితులపై 376డి, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సోలన్ ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మరోవైపు, కేరళలో ఓ దళిత అథ్లెట్‌పై దాదాపు 60 మంది లైంగిక అకృత్యాలకు పాల్పడ్డారనే విషయం ఇటీవల సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారించేందుకు ఏర్పాటైన సిట్ ఇప్పటివరకు 44 మంది నిందితులను అరెస్టు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 30 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని డీఐజీ ఎస్ అజీతా బేగం తెలిపారు. నిందితుల్లో ఇద్దరు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసులు పంపించేందుకు ప్రణాళిక రచిస్తున్నామన్నారు. ఈ కేసులో మరో 13 మందిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. వారి ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నామని వెల్లడించారు. సిట్ పక్కా ఆధారాలతో శాస్త్రీయ విచారణ చేస్తూ ముందుకెళ్తోందని చెప్పారు. నిందితులెవరినీ వదిలిపెట్టమని, చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.