Kate Middleton Recovery : బ్రిటన్ యువరాజు విలియమ్ సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ తాను క్యాన్సర్ నుంచి బయటపడ్డట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె స్వయంగా పోస్టు చేశారు. ఇప్పుడు చాలా ఉపశమనంగా ఉందని, ఇక నుంచి పూర్తిగా కోలుకోవడంపైనే దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విలియమ్ దంపతులు ఆస్పత్రిని సందర్శించి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్యాన్సర్ రోగులను కలిసి వారికి మద్దతుగా నిలిచారు.
"గతేడాది నేను చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆస్పత్రి సిబ్బంది నన్ను చాలా బాగా చూసుకున్నారు. వారికి ధన్యావాదాలు. నేను ఇబ్బంది పడ్డ సమయంలో వారి నుంచి నాకు అందిన అన్ని సహాయ సహకారాలు అసాధారణమైనవి. రాయల్ మార్స్‌డెన్ ఆసుపత్రి సంయుక్త పోషకురాలిగా కొత్త పాత్రలోకి మారాను. ఆస్పత్రి పరిశోధనలకు మద్దతు ఇవ్వడం, రోగి, వారి కుటుంబ శ్రేయస్సును ప్రొత్సహించడం, ఎక్కువ మంది ప్రాణాలను నిలబెట్టడం, క్యాన్సర్ బారిన పడిన వారందరి అభిప్రాయాలను మారుస్తానని నమ్మకం ఉంది. క్యాన్సర్ నుంచి బయటపడ్డందుకు ఎంతో ఉపశమనంగా ఉంది. ఇక నుంచి పూర్తిగా కోలుకోవడంపైనే దృష్టి సారిస్తాను. సాధారణ స్థితికి రావడానికి కొంచెం సమయం పడుతుంది. క్యాన్సర్ బారిన పడిన వారికే ఇది తెలుస్తుంది. ఇక నుంచి కొత్త ఏడాదిలో చేయాల్సినదానిపై దృష్టి సారిస్తాను. ఇన్ని రోజుల నుంచి నాకు మద్దతుగా ప్రతిఒక్కరికి ధన్యావాదాలు" అని కేట్ మిడిల్టన్ పేర్కొన్నారు.
ఆస్పత్రికి దాతలుగా!
గతేడాది మార్చిలో తాను క్యాన్సర్ బారిన పడ్డట్లు కేట్ ప్రకటించారు. అప్పటి నుంచి ప్రజా జీవితానికి దూరంగా ఉన్న ఆమె.. ఆసుపత్రిలో పలు దశల వారీగా కీమోథెరపీ చేయించుకున్నారు. కేట్ చికిత్స పొందిన రాయల్ మార్స్‌డెన్ ఆసుపత్రికి విలియమ్ దంపతులు దాతలుగా ఉన్నారు. రాజ కుటుంబ సభ్యులుగా వీరు 3000కు పైగా పలు స్వచ్ఛంద సంస్థలు, ఆసుపత్రులకు దాతలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విలియమ్ దంపతులు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్న రోగులను పరామర్శించారు.