PV Sindhu 2028 Olympics: 2028 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే ఆలోచన ఉందని స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. తనకు ఇంకా చాలా ఆఫర్లు, డిమాండ్ ఉందని, BWF సర్క్యూట్‌లో మరెన్నో టైటిళ్లను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది. రెండుసార్లు ఒలింపిక్ పతకం గెలిచిన సింధు, గాయపడకుండా, ఫిజికల్‌గా మంచి కండిషన్‌లో ఉంటే మూడో పతకం సాధించే లక్ష్యంతో మళ్లీ ఒలింపిక్ బరిలో దిగుతానని ప్రకటించింది. లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యే సమయానికి సింధు వయసు 33 అవుతుంది.
మాజీ ప్రపంచ ఛాంపియన్ సింధు, 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. ఇటీవల భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌లో సింధు అడుగుపెట్టింది. 16వ రౌండ్‌లో చైనాకు చెందిన హీ బింగ్ జియావో చేతిలో ఓడిపోయింది. ప్రిక్వార్టర్ ఫైనల్‌లో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
గత ఒలింపిక్స్ ఫలితాలు, భవిష్యత్తు లక్ష్యాలపై పీవీ సింధు మాట్లాడింది. 'ఇలా కొన్నిసార్లు జరుగుతుంది. నేను రెండు ఒలింపిక్స్ పతకాలు గెలిచాను. మూడోసారి పతకం పొందలేకపోయాను. కానీ నేను బాగా ఆడానని అనుకుంటున్నాను. నేను నా తప్పుల నుంచి నేర్చుకుంటాను. బలంగా తిరిగి వస్తాను. అంతటితో ముగిసిపోలేదు. నేను ఒక్కో సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాను. రాబోయే ఒలింపిక్స్ నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది. కాబట్టి నా ప్రధాన లక్ష్యం ఫిట్‌గా, ప్రేరణతో, గాయపడకుండా ఉండటం. నేను చేసే పనిని ఆనందించడం' అని తెలిపింది.
విచారం లేదు
'రాబోయే కొన్ని సంవత్సరాల్లో మళ్లీ ఒలింపిక్స్‌కి వెళ్తాను. నేను గత ఓటమిని ద్వేషించడం లేదు. ఫర్వాలేదు, నేను దాని నుంచి బయటకు రావాలి. నాకు ఏ పశ్చాత్తాపం లేదు. నేను చాలా ఎక్కువ గేమ్స్ ఆడాలని అనుకుంటున్నాను. మరిన్ని టైటిళ్లను గెలవాలని, మరిన్ని పోడియంలపై నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నాను. అంతిమంగా తర్వాతి తరం భారత అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. నేను నా పరిమితులను అధిగమించడానికి, నా కెరీర్‌లో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను' అని తెలిపింది.