EV Zip Vechicles Metro : ప్రయాణికులకు మెట్రో మరో శుభవార్త చెప్పింది. ప్రయాణికులు స్టేషన్ నుంచి గమ్యస్థానానికి చేరుకోవడాన్ని సులభతరం చేసింది. కాలుష్య రహిత వాహనాలను మెట్రో స్టేషన్‌తో అనుసంధానం చేసింది. ఇకపై మెట్రో నుంచి ఇంటికి, కార్యాలయానికి, కళాశాలలకు వెళ్లే వారు సొంత వాహనాలను వాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈవీ జిప్‌తో ఇక మీ గమ్యాన్ని ప్రశాంతంగా చేరుకోవచ్చని హామీ ఇస్తుంది.
హైదరాబాద్ మహానగరంలో మెట్రో అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థ. అతిపెద్ద పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచే ప్రాజెక్ట్. దిల్లీ మెట్రో తర్వాత హైదరాబాద్ మెట్రో దేశంలోనే రెండవ అతిపెద్ద నెట్‌వర్క్. ఇంతటి పేరు ప్రఖ్యాతలు గడించిన మెట్రో స్టేషన్ నుంచి వివిధ కళాశాలలకు, పాఠశాలలకు, ఉద్యోగాలకు, వ్యాపార నిమిత్తం వెళ్లే వారు అక్కడి నుంచి సొంత వాహనాలను వినియోగిస్తున్నారు. మరికొందరు ఆటో, క్యాబ్‌లను వినియోగిస్తున్నారు. అయితే అవి సమయానికి చేరుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై దృష్టిసారించిన మెట్రో, ఎల్.అండ్.టీ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫస్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ వద్ద ఈవీ వాహనాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.
మహిళలకు సయోధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. ద్విచక్ర వాహనం నడపడంలో మెళుకువలు నేర్పించారు. రద్దీ ప్రాంతంలో ప్రయాణించడంపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఐదు మంది మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చామని, భవిష్యత్‌లో వందమందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సయోధ్య ఫౌండర్ సభ్యురాలు మృదులత తెలిపారు.
మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకం : ఈవీ జిప్‌తో సహా ఇప్పటి వరకు 9 సంస్థలు మొదటి - చివరి మైల్ కనెక్టివిటీ కింద తమ సేవలు అందిస్తున్నాయని చెప్పారు. రోజూ మెట్రో రైల్‌లో ప్రయాణం చేస్తున్న సుమారు 5 లక్షల మందిలో 1.25 లక్షల మందిని ఈ సంస్థల వాహనాలు వారి వారి గమ్యాలకు చేరుస్తున్నాయని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. వీటిలో మహిళా ప్రయాణీకుల కోసం కూడా ప్రత్యేకంగా మహిళలే నడిపే ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పుడు తొలిసారిగా ఈవీ జిప్ ఈషా పేరున వారు ప్రవేశపెట్టారు.
ఈ వాహనాలను వందకు పైగా పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్ల నుండి మల్కాజ్ గిరి, సైనిక్ పురి, ఈసీఐఎల్ వంటి ప్రాంతాలకు ఎక్కువగా నడుపుతున్నారు. వీటిని త్వరలోనే ఇతర స్టేషన్లకు, ప్రాంతాలకు విస్తరిస్తారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో రైల్ వ్యవస్థను నలుదిక్కులా విస్తరిస్తున్నట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
200 కిలోమీటర్ల మెట్రో : 69 కిలోమీటర్ల తొలి అడుగుతో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోని దాదాపు 200 కిలోమీటర్లకు పైగా విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈవీ జిప్ సంస్థ హైదరాబాద్‌లో మొదటి - చివరి మైల్ కనెక్టివిటీలో భాగంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, క్యాబ్ లను ఎల్.ఎండ్.టీ ఎండీ కేవీబీ రెడ్డితో కలిసి ఎన్వీఎస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు న్యూ ఇయర్ గిఫ్ట్ - ఆ ప్రాంతాలకు మెట్రో పొడిగింపు