Mahashivratri 2025 Puja Vidhi : పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినానికి సమయం దగ్గరపడింది. ఈ పవిత్రమైన రోజున దేశంలోని శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతాయి. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండగ ప్రత్యేకం. ఈ క్రమంలోనే భక్తులు శివయ్య అనుగ్రహం కోసం ఉపవాసాలు, జాగరణ ఉండడమే కాకుండా రుద్రాక్ష మాలాధారణలు, రుద్రాభిషేకాలు చేస్తుంటారు.
అదేవిధంగా, శివరాత్రి రోజున చాలా మంది ఆ పరమ శివుడి ఆశీస్సులు తమపైన ఉండాలని శివునికి బిల్వపత్రాలను సమర్పిస్తుంటారు. ఇలా చేయడం వల్ల పాపాలు అన్నీ తొలగిపోయి, పుణ్యం దక్కుతుందని శివపురాణం చెబుతోంది. అయితే, బిల్వపత్రాలను సమర్పించేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే, మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు పాటించడం ద్వారా శివానుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
శివపూజలో బిల్వపత్ర ప్రాముఖ్యత :
పురాణాల ప్రకారం బిల్వపత్ర వృక్షం పార్వతీ దేవి చెమట నుంచి ఉద్భవించినట్లు చెబుతారు. పార్వతీ దేవి అన్ని రూపాలూ ఈ చెట్టులో ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే రుద్రుడిని 'బిల్వపత్రే' అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు స్వర్గంలో ఉన్న కల్పవృక్షంతో సమానమట. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఆకులతో శివుడిని పూజిస్తే ఇక ఏ అలంకరణ కూడా చేయాల్సిన అవసరం లేదని అంటుంటారు.
"వారసుడు పుట్టాలని ఆశపడుతున్నారా? - శివరాత్రి నాడు ఈ పూలతో పూజిస్తే తప్పక నెరవేరుతుంది"
బిల్వపత్రం శివుడికి ఎలా సమర్పించాలంటే?
- మహాశివరాత్రి రోజు ఒక్క బిల్వపత్రంతో పరమశివుడిని పూజిస్తే వెయ్యి పద్మ పుష్పాలతో పూజించిన ఫలితం కలుగుతుందట. అలా పూజించేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే శివానుగ్రహం పొంది సంవత్సరం మొత్తం సకల శుభాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్.
- మారేడు దళం మీద గంధం రాసి దాన్ని శివలింగం దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే ఏడాదంతా సర్వ సంపదలు సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు.
- అదేవిధంగా, శివరాత్రి పర్వదినాన బిల్వ పత్రాన్ని కొబ్బరి నీళ్లలో ముంచి ఆపై దాన్ని శివలింగం దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే రాజవైభవం కలుగుతుందట. అలాగే, ఉన్నత స్థాయి పదవులు వరిస్తాయంటున్నారు. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తిని సిద్ధింపచేసుకోవచ్చని సూచిస్తున్నారు.
మహా శివరాత్రి రోజు "ఉపవాసం" ఉంటున్నారా? - ఈ నియమాలు పాటిస్తేనే పూర్తి ఫలితం!
మారేడు మొక్క దగ్గర పాటించాల్సిన విధులు :
- మహాశివరాత్రి రోజు మారేడు మొక్క లేదా చెట్టు సమీపంలో అన్నదానం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చంటున్నారు. అంటే ఈ వృక్షం సమీపంలో ఎవరికైనా భోజనం పెడితే కొన్ని వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుందని చెబుతున్నారు జ్యోతిష్యులు.
- ధర్మ సింధు గ్రంథం ప్రకారం శివరాత్రి నాడు ఎవరైనా సరే మారేడు మొక్క లేదా బిల్వ వృక్షం దగ్గర ఆవు నెయ్యి లేదా క్షీరాన్నం దానం చేస్తే వారికి జీవితం మొత్తం సంపదకు లోటు ఉండదట.
- శివరాత్రి రోజు మారేడు మొక్క దగ్గర 11 కొత్త ఎర్రటి ప్రమిదలు ఉంచి వాటిల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించినట్లయితే జీవిత కాలం శివానుగ్రహం లభించి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలూ తొలగిపోతాయని ప్రామాణిక గ్రంథాల్లో పేర్కొన్నారు.
- మహాశివరాత్రి సందర్భంగా ఎవరైనా సరే దగ్గరలోని మారేడు చెట్టు వద్దకెళ్లి దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి, అనంతరం ఆ చెట్టు ఒక కొమ్మకు ఎరుపు రంగు దారాన్ని చుట్టినట్లయితే వివాహపరమైన సమస్యలు తొలగిపోతాయట. అదే, పసుపు రంగు దారాన్ని కట్టినట్లయితే ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.