Woman Constable Died by suicide in Yadadri : పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంట్లో చావు మేళం మోగనుంది. కుమార్తె వివాహం అంగరంగవైభవంగా నిర్వహించి అత్తారింటికి పంపాలని కలలు గన్న ఆ తల్లిదండ్రులు ఇప్పుడు శ్మశానానికి పంపేందుకు ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పది రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లాకు చెందిన అనూష యాదాద్రి భువనగిరి పట్టణ శివారులోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఇటీవల అనూషకి వివాహం కుదిరింది. మార్చి 6న వివాహం జరగాల్సి ఉంది. అందుకు సంబంధించి ఇరు కుటుంబాల్లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ అనూష ఇవాళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన తమ కుమార్తె విగత జీవిగా మారడం చూసి ఆ తల్లి కంటతడి పెట్టుకున్న తీరు అందరిని కలచివేసింది. మృతికి ఇంక కారణాలు తెలియలేదు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి వచ్చిన సహచరులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కుమారుడిని ఫోన్ చూడొద్దని మందలించిన తల్లి - ఏం చేశాడో తెలిస్తే ఊలిక్కి పడాల్సిందే!