Putin About Donald Trump : 2020 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచి ఉంటే ఉక్రెయిన్‌తో యుద్ధం రాకుండా ఆపేవారని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధినేత పుతిన్ అన్నారు. రష్యా ప్రభుత్వ టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడిన పుతిన ట్రంప్‌ను తెలివైన నేతగా అభివర్ణించారు. 2020 ఎన్నికల్లో ట్రంప్ గెలిచి ఉంటే ఉక్రెయిన్‌తో యుద్ధం రాకుండా ఆపేవారని పేర్కొన్నారు.
తాను పుతిన్‌తో కలిసి మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన విస్తృత శ్రేణి అంశాలపై చర్చలకు మాస్కో కూడా సిద్ధంగా ఉందన్నారు. ఉక్రెయిన్‌తో సంఘర్షణకు సంబంధించి సంప్రదింపులు జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే ఈ విషయం ఎన్నోసార్లు చెప్పినట్లు, మళ్లీ చెబుతున్నట్లు పుతిన్ తెలిపారు. ట్రంప్ ఎంతో చురుకైన వ్యక్తి అని, చెప్పిన విషయాలను ఆచరణలో పెడతారన్నారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచి ఉంటే ఒకవేళ ఆయన విజయాన్ని దొంగిలించకపోయి ఉంటే ఉక్రెయిన్ సంక్షోభం వచ్చి ఉండేది కాదన్నారు. చర్చలకై వాషింగ్టన్ నుంచి పిలుపుకోసం ఎదురుచూస్తున్నట్లు పుతిన్ తెలిపారు.
అలా చేస్తే యుద్ధం వెంటనే ఆగుతుంది : ట్రంప్
మరోవైపు, పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల(OPEC) చమురు ధరలు తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి చేశారు. తద్వారా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందని అన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ట్రంప్ ప్రస్తావించారు. దాదాపు మూడోళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి కారణం ఈ దేశాలే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
"OPEC దేశాలు చమురు ధరను తగ్గించాలని మేము కోరుకుంటున్నాము. అది ఉక్రెయిన్‌లో జరుగుతున్న విషాదాన్ని ఆటోమెటిక్‌గా ఆపేస్తుంది. యుద్ధం ఇరు వైపులకు కూడా విషాదమే. ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు పెద్ద సంఖ్యలో రష్యా, ఉక్రెయిన్ సైనికులు మృతిచెందారు. ఇప్పటివరకు దాదాపు పది లక్షల మంది మరణించారు. ఇంకా వారానికి వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఇది పిచ్చి. ఇది ఒక పిచ్చి యుద్ధం. నేను అప్పుడు అధ్యక్షుడిని అయి ఉంటే, యుద్ధం వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మేము దాన్ని ఆపాలనుకుంటున్నాము. అది జరగడానికి ఉన్న మార్గం చమురు ధరలు తగ్గించడం. ధర ఎక్కువగా ఉంటే యుద్ధం అంత సులభంగా ముగియదు. అందుకే ఓపెక్ దేశాలు గ్రౌండ్లోకి దిగి చమురు ధరలు తగ్గించాలి. అప్పుడు వెంటనే యుద్ధం ముగుస్తుంది." అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.