Tahawwur Rana Extradition To India : ముంబయి ఉగ్రదాడుల కేసులో దోషిగా ఉన్న తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. మొత్తానికి రాణాను అమెరికా నుంచి భారత్ తీసుకొచ్చే ప్రయత్నం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. అతడిని న్యూదిల్లీకి అప్పగించేందుకు అగ్రరాజ్య సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు రాణా రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడైన తహవూర్ రాణా 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ప్రస్తుతం లాస్ఏంజెలెస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్‌లోనూ చుక్కెదురైంది. దీంతో చివరి ప్రయత్నంగా గతేడాది నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు.
ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని ఇటీవల అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు 20 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొన్ని నెలల్లో అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నాయి.
26/11 దాడులకు ముందు ఆ కుట్ర మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబయిలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయం. ముంబయిలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది. ఉగ్ర దాడులు, కుట్రపై రాణా, హెడ్లీపై కేసులు నమోదు చేశారు. 26/11 దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకొన్నారు.
ముంబయిలో ఏం జరిగింది?
పాకిస్థాన్ ఉగ్రవాదులు నవంబర్ 26, 2008 రాత్రి పాక్ నుంచి కొలాబా సముద్రతీరానికి చేరి ముంబయిలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వేస్టేషన్‌లోకి చొరబడ్డారు. వెంటనే వారి చేతుల్లో ఉన్న ఏకే-47 తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. వరుసగా 12 చోట్ల దాడులు జరిగాయి. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మృతుల్లో కొందరు విదేశీయులు ఉన్నారు.