Parvathamalai Temple : ముక్కోటి దేవతల్లో ముక్కంటికి ఉన్న ప్రత్యేకతే వేరు. భోళా శంకరుడిగా, ప్రళయకాల రుద్రుడిగా ఆయన రీతి అంతా భిన్నమే. మనసావాచా తనను స్మరిస్తే, శరణువేడింది రాక్షసుడైనా సరే వరాలిచ్చేస్తాడు. అలాంటి పరమేశ్వరుడి ప్రసన్నం కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఆరాధిస్తుంటారు. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటూ ఆ శివయ్య ఆజ్ఞకోసం, ఆయన ప్రసన్నం కోసం నిత్య పూజలు చేస్తుంటారు.
అయితే, పరమశివుడిని పూజించేందుకు ఏ శివాలయానికి వెళ్లినా సరిపోతుంది. మనసులో భక్తి ఉంటే సరిపోతుంది. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయానికి వెళ్లాలంటే మాత్రం కేవలం భక్తి చాలదు. గుండెల్లో దమ్ము, ధైర్యం ఉండాలి. అప్పుడే, ఆ శివాలయానికి వెళ్లడం సాధ్యమవుతుంది! అదేంటి అనుకుంటున్నారా? ఆ వివరాలు తెలియాలంటే "పర్వతమలై శివాలయం" గురించి తెలుసుకోవాల్సిందే.
తమిళనాడు రాష్ట్రంలోని, తిరువణ్ణామలై జిల్లాలో ఉందీ "పర్వతమలై శివాలయం". ఈ ఆలయం ఎత్తయిన కొండ మీద ఉంటుంది. ఇలాంటి కొండలు చాలా చూశాం, ఎక్కాం అనుకుంటున్నారేమో? ఇది అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది. ఈ గుడికి చేరుకోవాలంటే ఏడు కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. అప్పుడుగానీ ఆలయానికి చేరుకోలేరు. అంతేకాదు, ఇరుకైన మెట్లు, రాతి కొండల మీదుగా ఎంతో సాహసోపేతంగా ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. సముద్ర మట్టానికి సుమారు 5 వేల అడుగుల ఎత్తులో ఉంటుందీ కొండ.
హనుమంతుడి సంజీవ పర్వతం నుంచి :
ఈ కొండ ఎలా ఏర్పడింది అనే విషయంలో ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. రావణుడితో సాగుతున్న యుద్ధంలో మూర్ఛపోయిన లక్ష్మణుడిని బతికించడం కోసం ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తున్నప్పుడు, ఆ పర్వతం లోనుంచి కొంత భాగం ఈ ప్రాంతంలో పడిందని, ఆ భాగమే ఈ పర్వతమలై అని అక్కడి వారు నమ్ముతుంటారు. ఎన్నో ఔషధ మూలికలు నిండి ఉన్న ఈ కొండపైకి చేరుకొని, మహా శివుడిని దర్శించుకుంటే ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, చక్కగా ఉంటామని భక్తులు నమ్ముతారు.
అందుకే, ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అయితే, శారీరకంగా ఫిట్‌గా ఉన్నవాళ్లు మాత్రమే పై వరకూ వెళ్లగలరు. ఎత్తయిన దారులు, దట్టమైన చెట్ల నడుమ సాగే ఈ ప్రయాణాన్ని సాహసికులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ట్రెక్కింగ్ చేస్తూ ముందుకు సాగుతుంటారు. వారితోపాటు మిగిలిన భక్తులు కూడా ఎంతో కష్టపడి కొండపైకి చేరుకుంటూ ఉంటారు. అంత ఎత్తునుంచి కిందకు చూస్తే గుండెలు గుభేల్ మంటాయని చెబుతుంటారు చాలా మంది భక్తులు. అందుకే, గుండెల్లో ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ శివాలయంలోకి ప్రవేశించగలరు అని అంటూ ఉంటారు. మీరు శివయ్య భక్తులైతే, ఏ మాత్రం అవకాశం ఉన్నా తప్పకుండా ఓసారి దర్శించుకొని రండి.