Dil Raju in Income Tax Office : తెలుగు సినీ ప్రోడ్యూసర్ దిల్ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. వ్యాపారాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని ఐటీ అధికారులు దిల్ రాజుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను ఆయన ఐటీ అధికారులకు సమర్పించినట్లు సమాచారం.
భారీ సినిమాలు : సంక్రాంతి పండుగ సందర్భంగా దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో రూపొందించిన గేమ్‌ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను విడుదల చేశారు. దీంతో సినీ నిర్మాణం, సినిమాల విడుదల తర్వాత వచ్చే లాభాల వ్యవహారంపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. దిల్ రాజుతో పాటు పలువురు డైరెక్టర్లు, ఇతర నిర్మాణ సంస్థల యజమానుల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు జరిగిన ఐటీ సోదాలపై దిల్‌రాజు ఇటీవల స్పందించారు.
"2008లో ఒకసారి ఐటీ శాఖ దాడులు చేసింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మా ఇళ్లు, కార్యాలయాలపై ఈ సోదాలు జరిగాయి. మధ్యలో మూడుసార్లు సర్వేలు చేసి అకౌంట్ బుక్స్ తనిఖీ చేశారు. వ్యాపార రంగంలో ఉన్నవారిపై ఇలాంటి ఐటీ సోదాలు సర్వ సాధారణం. ఈ దాడుల్లో మా ఇల్లు, కార్యాలయంలో ఇంత డబ్బు దొరికింది, ఏవేవో డాక్యుమెంట్లు దొరికాయి అంటూ కొన్ని ఛానల్స్‌లో వార్తలను చాలా హైలైట్ చేశారు. మా దగ్గర అలాంటిది ఏమీ లభించలేదు. మా వద్ద ఎలాంటి అనధికారిక డాక్యుమెంట్లు, నగదు అధికారులు గుర్తించలేదు" -దిల్ రాజు, సినీ నిర్మాత
ఎన్నో ఐటీ దాడులు జరుగుతున్నా, మీడియా మొత్తం నాపైనే ఫోకస్ చేసింది : దిల్‌రాజు