Budget Session PM Modi Speech : పదేళ్ల తమ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అంటూ కేవలం నినాదంతో అధికారం అనుభవించాయంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు. పేద, మధ్య తరగతి వర్గాల కలలను పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
"రాష్ట్రపతి ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. వరుసగా మూడోసారి అధికారం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. వికసిత్ భారత్ లక్ష్యంగా మా ప్రభుత్వం పని చేస్తోంది. కీలక నిర్ణయాల ద్వారా ఆదా అయిన డబ్బుతో ఇతరుల (పరోక్షంగా కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ) మాదిరిగా అద్దాలమేడ నిర్మించుకోలేదు. అవినీతి నిర్మూలన చర్యలతో ఆదా అయిన డబ్బు దేశాభివృద్ధికి వినియోగించాం. ఐదు దశాబ్దాల వరకు గరీబీ హఠావో నినాదం వింటూ వచ్చాం. ఇప్పుడు 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. క్రమబద్ధంగా, అంకితభావంతో, చిత్తుశుద్ధితో పేదల కోసం జీవితాన్ని అంకితం చేస్తే ఇది సాధ్యమవుతుంది. పేదలకు అసత్య నినాదాలు కాదు. మేం అసలైన అభివృద్ధి చూపించాం."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
VIDEO | Replying in Lok Sabha to the discussion on the Motion of Thanks on the President's Address, PM Modi (@narendramodi) says: " yesterday and today, all the honourable members expressed their views on motion of thanks. it is natural and a tradition of democracy, there was… pic.twitter.com/bOWcPh7gOM
— Press Trust of India (@PTI_News) February 4, 2025
'ఆ నిర్ణయంతో లక్ష కోట్లు ఆదా'
ఇథనాల్ కలపటం వల్ల పెట్రోల్, డీజిల్ భారం తగ్గిందని ప్రధాని మోదీ తెలిపారు. 'మనం ఇంధనంలో స్వయం సమృద్ధి కాదని తెలుసు. దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇథనాల్ కలపాలని మేం ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. అలా చేయడం వల్లే పెట్రోల్, డీజిల్ ఖర్చులు తగ్గాయి. ఆ ఒక్క నిర్ణయంతో లక్ష కోట్లు ఆదా అయింది. ఆ డబ్బు రైతులకు వెళ్లింది. నేను పొదుపు గురించి మాట్లాడుతున్నా. గతంలో ఇన్నికోట్ల కుంభకోణం అంటూ పేపర్లలో హెడ్‌లైన్లు కనిపించేవి. పదేళ్లు అయింది. కుంభకోణాలు చేయకుండా, జరగకుండా చూడటం వల్ల లక్షల కోట్లు మిగిలాయి. కానీ ఆ డబ్బుతో మేం అద్దాల మేడ నిర్మించుకోలేదు. వాటిని దేశాభివృద్ధికి వినియోగించాం' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.