Oil Free Poori Recipe in Telugu : చాలా మంది ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలలో ఒకటి పూరీ. కేవలం టిఫెన్‌గా మాత్రమే కాకుండా ఫెస్టివల్ టైమ్స్, తినాలనిపించినప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకుంటుంటారు. ఇందులోకి చికెన్, మటన్ కర్రీలు కాంబినేషన్‌గా ఉంటే ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. అయితే, మనందరం పూరీలను గోధుమపిండితో చేసి నూనెలో వేయిస్తాం.
కానీ, మీకు తెలుసా? బియ్యప్పిండితో పైగా నూనెలో దేవకుండా "పూరీలు" తయారు చేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా పూరీలు ఎలా ఆశ్చర్యపోతున్నారా! అంతేకాదు, ఇవి నూనెలో వేసిన పూరీల మాదిరిగానే పొంగుతాయి. రంగు, రుచి కూడా వారెవా అనిపిస్తుంది. పైగా ఈ పూరీలు నూనె లేనివి కదా ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలిగించవు! మరి, ఇంకెందుకు ఆలస్యమెందుకు నూనె లేకుండా పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యప్పిండి - 2 కప్పులు
- బంగాళదుంప - 1
- మెంతి ఆకుల పొడి - చెంచా
- కొత్తిమీర తరుగు - చారెడు
- చిల్లీ ఫ్లేక్స్ - చెంచా
- ఉప్పు - రుచికి సరిపడా
- ఆయిల్ - 4 చెంచాలు(పెనం మీద రాసుకోవడానికి)
ఉప్మారవ్వతో నిమిషాల్లో చేసుకునే "రవ్వ పూరీలు" - ఒక్కసారి తిన్నారంటే టేస్ట్‌కి ఎవరైనా ఫిదా!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బంగాళదుంపను ఉడికించి, పొట్టు తీసుకోవాలి. ఆపై దాన్ని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై అడుగుభాగం మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని కప్పున్నర వరకు వాటర్ పోసి లో ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి.
- అవి మరిగిన తర్వాత అందులో మెంతి ఆకుల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, బియ్యప్పిండి ఇలా ఒక్కొక్కటిగా వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూతపెట్టేసి అరనిమిషం పాటు ఉంచి ఆపై దించేయాలి.
- అనంతరం ఆ మిశ్రమంలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప తురుము వేసి మొత్తం కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. పూరీ పిండి మాదిరిగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని చపాతీ పీటపై మీకు కావాల్సిన సైజ్‌లో పూరీల మాదిరిగా చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై దోశ పెనం పెట్టి వేడి చేసుకోవాలి. పెనం వేడయ్యాక చెంచాతో కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా చేసుకొన్న పూరీలను ఒక్కొక్కటిగా కాల్చుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో రుచికరంగా ఉండే నూనెలో వేయించకుండా ప్రిపేర్ చేసుకున్న "పూరీలు" రెడీ!
- మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఓసారి ఇలా పూరీలను చేసి చూడండి. ఒక్కసారి ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారంటే ఎప్పుడూ ఇదే తీరులో చేసుకుంటారు!
ఇలా చేస్తే సూపర్ టేస్టీ పూరీ కర్రీ - అచ్చం హోటల్ స్టైల్లో బొంబాయి చట్నీ