Ind vs Eng T20 Series : ఇంగ్లాండ్‌పై వరుస టీ20ల విజయాలతో టీమ్ఇండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టుపై 2- 0 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉండడంతో సంబరపడుతున్నారు. కానీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకో తెలుసా?
భారీ ధర
ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్, లివింగ్ స్టోన్‌ను దక్కించుకుంది. సాల్ట్‌ను రూ.11.50 కోట్లు, లివింగ్ స్టోన్‌ను రూ.8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ ఇద్దరూ తమ జట్టు తరఫున రాణిస్తారని ఆర్సీబీ భావించింది. అయితే టీమ్ఇండియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మాత్రం సాల్ట్, లివింగ్ స్టోన్ ఘోరంగా విఫలమవుతున్నారు. తొలి టీ20లో ఇద్దరూ సున్నాకే పెవిలియన్ చేరగా, రెండో మ్యాచ్‌లో సాల్ట్ (4 పరుగులు), లివింగ్ స్టోన్ (13 పరుగులు) స్వల్ప స్కోర్లకే ఔట్ అయ్యారు.
వాళ్లు ఆందోళనలో
వేలంలో తమ జట్టులోకి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ఫిల్ సాల్డ్, లివింగ్ స్టోన్పై ఆర్సీబీ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే భారత గడ్డపై మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతుండడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. రెండు నెలల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2025 సీజన్లో వీరు ఎలా రాణిస్తారోనని ఆందోళన పడుతున్నారు.
కీలక వ్యాఖ్యలు
ఈ క్రమంలోనే సాల్ట్, లివింగ్ స్టోన్పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాల్ట్, లివింగ్ స్టోన్ వరుస వైఫల్యాలు ఆర్సీబీకి ఆందోళన కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. రెండో టీ20లో ఫిల్ సాల్ట్‌ను అర్షదీప్ సింగ్ ఈజీగా ఔట్ చేశాడని, లివింగ్ స్టోన్ కూడా వేగంగానే పెలివియన్ బాటపట్టాడని అన్నాడు. ఈ ఇద్దరు ఔటైనప్పుడు తనకు ఆర్సీబీ గుర్తుకువచ్చిందని పేర్కొన్నాడు.
అలాగే ఇంగ్లాండ్ బ్యాటర్లపై ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లు తాము ఔట్ అవ్వడానికి కారణం గాలి అని చెప్పడానికి లేదని ఎద్దేవా చేశాడు. 'పొగమంచు కారణంగా బంతిని చూడలేకపోయానని హ్యారీ బ్రూక్ తొలి మ్యాచ్ తర్వాత అన్నాడు. మరి రెండో టీ20లో బంతి స్పష్టంగా కనిపించింది కదా. షార్ట్ బాల్‌ను ఫ్రంట్ ఫుట్‌లో ఆడి బ్రూక్ ఔట్ అయ్యాడు. ఇప్పుడేం సాకు చెబుతారు?' అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్ షేర్ చేసిన వీడియోలో వ్యాఖ్యానించాడు.
T20 సిరీస్ మొత్తానికి నితీశ్ రెడ్డి దూరం- షాక్‌లో SRH ఫ్యాన్స్!